అమల సరికొత్త ఇన్నింగ్స్ మొదలెట్టారు. ‘ఒకే ఒక జీవితం’తో. ఇందులో అమ్మ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అందులో అమల ఒదిగిపోయిన విధానం అందరికీ నచ్చింది. ఇప్పటి నుంచీ.. టాలీవుడ్ లో అమ్మ పాత్ర అనగానే… అమల ఓ మంచి ఆప్షన్‌గా కనిపించబోతున్నారు. ‘ఒకే ఒక జీవితం’ తరవాత.. అమలకు మంచి అవకాశాలు వస్తున్నట్టు టాక్. ప్రస్తుతం అమల ఓ బడా బ్యానర్లో కీలక పాత్ర పోషించడానికి ఒప్పుకొన్నారని సమాచారం. వెబ్ సిరీస్‌ల నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయట. అయితే.. నాగార్జునతో మళ్లీ వెండి తెర పంచుకొనే అవకాశం ఉందా..? అని అడిగితే.. ‘నో’ అంటున్నారామె. ”ఇంట్లో ఎలాగూ కలిసే ఉంటాం కదా. తెరపై కూడా ఎందుకు..” అని తెలివిగా సమాధానం ఇస్తున్నారు. వెండి తెరపై అమల, నాగ్ కనిపిస్తే… భార్యాభర్తల్లానే నటించాలి. లేదంటే… ఆ కలయిక అపసవ్యంగా ఉంటుంది. అలాంటి కథలు వచ్చే అవకాశమే లేదు. అందుకే అమల ముందే ఊహించి `నో` చెప్పేశారేమో. అయితే.. భవిష్యత్తులో ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తానంటున్నారామె. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తరవాత తెలుగులో కంటే మిగిలిన భాషల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. తెలుగులో మళ్లీ కనిపిస్తే ఓ మంచి పాత్ర వేయాలి అనుకొన్నా. అందుకే ఇన్నాళ్లు ఎదురు చూశా. ‘ఒకే ఒక జీవితం’ సినిమా అందరికీ నచ్చింది. నా పాత్ర మరింత చేరువ అయ్యింది. ఇక మీదటా మంచి పాత్రలొస్తే `నో` చెప్పను“ అన్నారు అమల.