అల్లర్లు ఒక్క పూటతో ముగిశాయి కానీ అమలాపురం ప్రజలకు మాత్రం అప్పట్నుంచి నరకం అనుభవిస్తూనే ఉన్నారు. ఇంటర్నెట్ నిషేధించిన అధికారులు…అంతకు మించి చేయగలిగిందేం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.
కోనసీమ జిల్లాలో అల్లర్లు ఎందుకు చేశారో కనిపెట్టారు ? ఎవరు చేశారో కూడా కనిపెట్టారు ? వాట్సాప్ చాట్లను కొన్ని మీడియా సంస్థలకు పోలీసులు ఇచ్చారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు మొహాలు కనిపించని ఫోటోలను పెట్టి… వాళ్లు టీడీపీ వాళ్లే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం మాకు ఇవేం తెలియదు అని అమలాపురం మొత్తం నెట్ ఆపేసి రిలాక్స్ అవుతున్నారు. నెట్ ఆన్ చేస్తే మళ్లీ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చాట్ చేసుకుని అల్లర్లు చేస్తారోనని వారి భయం.
అయితే అల్లర్లు ఆపడానికి నెట్ ఆపేయడం ఒక్కటే మార్గమా అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే పనులు జరగవు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా నెట్ లేకపోతే ఎందుకూ పనికి రాదు. ప్రతీ సమాచారం మాత్రమే కాదు.. విద్య, ఉపాధి ఇలా మొత్తం ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ అన్నింటినీ వారం రోజుల నుంచి నిలుపుదల చేసేసి పోలీసులు అల్లర్లు ఆపేశామని గొప్పగా ప్రకటించుకుంటున్నారు. ఇంకా రెండు రోజుల పాటు తప్పదని అంటున్నారు.
పోలీసులు తమ కు శ్రమ లేకుండా అత్యంత దగ్గరి దారి అయిన నెట్ నిలిపివేయడాన్ని వాడుకుంటున్నారు కానీ… 99 శాతం ప్రజలకు ఏర్పడే ఇబ్బందుల్ని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అల్లర్లకు పాల్పడేవారు.. పిలుపునిచ్చేవారు చాలా కొద్ది మంది ఉంటారు. వారిని కంట్రోల్ చేస్తే పోయేదానికి మొత్తం ప్రజలందర్నీ ఇబ్బంది పెట్టడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. కానీ పోలీసులు వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.