వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు మోకాళ్లపై వంగి మరీ దండం పెట్టిన బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఎక్కడకు వెళ్లి సొంత సామాజికవర్గం ఈడించుకుంటోంది. ఈ ఆందోళలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లి జాతి తరఫున రుణపడి ఉంటానని మంత్రి వేణు ప్రకటించడం సంచలనం సృష్టించింది. శెట్టిపల్లి జాతిని సుబ్బారెడ్డి దగ్గర దిగజార్చారని కోనసీమ లో నిరసన సెగలు రేగుతున్నాయి.
తాజాగా అమలాపురంలో వైసీపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి జోగి రమేష్తో పాటు కొత్త ఇంచార్జి మిధున్రెడ్డితో కలిసి మంత్రి చెల్లుబోయిన కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనపై వైసీపీలోని శెట్టి బలిజ నేతలే తిరుగుబాటు చేశారు. వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మంత్రి వేణు ను పదవి నుండి భర్తరఫ్ చేసి… నిజమైన శెట్టిబలిజ కులస్తుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి సర్ది చెప్పడానికి ఇతర నేతలకు తల ప్రాణం తోకకు వచ్చింది.
మంత్రి పదవిని కాపాడుకునేందుకో.. నిలబెట్టుకునేందుకో కానీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తాను తాను తన కుల ప్రతినిధిగా ప్రకటించుకుని మరీ వైవీ సుబ్బారెడ్డికి కాళ్లకు దండం పెట్టడం ఆ సామాజికవర్గాన్ని మనస్తాపానికి గురి చేసింది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా గౌరవంగా బతికే సామాజికవర్గానికి ఏ దుస్థితి తీసుకొచ్చారన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇది అంతకంతకూ పెరిగిపోతోంది. ఆయన కాళ్లకు నమస్కారం పెడుతున్న సమయంలో వైవీ సుబ్బారెడ్డి బాడీ లాంగ్వేజ్ కూడా తేడాగా ఉండటంతో ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు.