వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తోట త్రిమూర్తులు చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి… వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందే ఆయనకు.. వైసీపీ తరపున ఆఫర్ వచ్చింది. వ్యాపార, ఆప్తమిత్రులైన ఆమంచి, ఆవంతి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు గట్టిగానే రాయబారం చేశారు. అయితే.. అప్పట్లో తన కుమారుడికి రాజమండ్రి సీటు, తనకు రామచంద్రాపురం సీటు కావాలని.. పట్టుబట్టడంతో.. జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. దాంతో ఆయన టీడీపీ తరపునే ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి తర్వాత ఆయన … అప్పటి వరకూ ఉన్న టీడీపీలో ఉండలేకపోయారు. పాత మిత్రులతో మార్గం సుగమం చేసుకోవడంతో… వైసీపీలో చేరిపోయారు.
టీడీపీ, జనసేనల్లోని కాపు నేతలను… వైసీపీలో చేర్చుకునే ఆపరేషన్‌ను… ఆ పార్టీ నేతలు ప్రారంభించారని.. విజయసాయిరెడ్డి తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. ఆపరేషన్ ఆమంచి… అంటూ… తోట త్రిమూర్తులు చేరిక తర్వాత చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమంటున్నారు. రాబోయే రోజుల్లో… ఎంతో మంది కాపు నేతలు… తమ పార్టీలోకి వస్తారని అంటున్నారు. తోట త్రిమూర్తులు చేరిక సమయంలో…ఆమంచినే కీలకంగా వ్యవహరించారు. రామచంద్రాపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ .. రెండు వర్గాలుగా ఉన్నారు. ఇప్పుడు… తోట త్రిమూర్తులు చేరికతో మూడో వర్గం అయినట్లయింది.
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేది లేదని ప్రకటించినా.. వైసీపీలోని కాపు నేతలు నోరు మెదపడం లేదని.. వారికి జగన్ అంటే భయం అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు సూటిగానే తగిలాయి. పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు వెక్కి తీసుకోవాలని ఆమంచి డిమాండ్ చేశారు. కాపులే కాకుండా.. అన్ని వర్గాల వారు… వైసీపీలో చేరుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తోట త్రిమూర్తులు మాత్రం.. పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడానికి సందేహించారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికి ఏమీ లేదని తప్పించుకున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ పై.. కాపు నాయకులతో… వైసీపీ గట్టిగానే ఎదురు దాడి చేయిస్తోంది.