ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి బ్రదర్స్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. చీరాల గడ్డను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ .. పర్చూరు వైసీపీ టిక్కెట్ ను సైతం వదిలేసుకున్నారు. కారణం ఏదైనా ఆయనకు జనసేన, టీడీపీల్లో చీరాల నుంచి టిక్కెట్ లభించే అవకాశం కూడా లేదు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరినా ఆయనకూ టిక్కెట్ లభించే చాన్స్ లేదు. ఈ కారణంగా తనకు ఇచ్చ చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. జనసేనలోనే ఉన్నానంటున్నారు కానీ… ఎవరికీ నమ్మకం లేదు.
ఆమంచి కృష్ణమోహన్… చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు మంచి అనుచరగణం ఉంది. ఓ సారి ఇండిపెండెంట్ గా గెలిచిన సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అయినా ఆయన ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఆమంచి స్వాములు గిద్దలూరు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆమంచి బ్రదర్స్ కలిసే రాజకీయాలు చేసేవారు. కానీ వారు వేసిన తప్పటడుగులు, ప్రత్యర్థులపై దాడులతో చేసిన రౌడీ రాజకీయం వారికి మైనస్ గా మారింది. టీడీపీలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినా చివరికి వైసీపీలో చేరారు.. అక్కడ అధినాయకత్వాన్ని మెప్పించడానికి జడ్జిలను తిట్టి కేసుల్లో ఇరుక్కున్నారు. అయినా టిక్కెట్ దొరకలేదు. ఇప్పుడు మొత్తంగా ఆమంచి బ్రదర్స్ తమ రాజకీయ జీవితాలను రిస్క్ లో పెట్టుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.