కరోనా కారణంగా వెనక్కితగ్గాను కానీ లేకపోతే.. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తించేవారట.. వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్. డాక్టర్ సుధాకర్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును… కృష్ణమోహన్ .. తప్పు పట్టారు. హైకోర్టును కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేసారు. దళిత డాకట్ర్ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు అని.. సీబీఐ విచారణ వేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయిందని చెప్పుకొచ్చారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదు.. కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతుందని చెప్పుకొచ్చారు. చిన్నచిన్న కేసులకు కూడా సీబీఐ విచారణ వేసే పనైతే.. ప్రతీ పోలీస్ స్టేషన్‌కి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఆమంచి వ్యాఖ్యలు న్యాయ,రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయింది. పీపీఈ కిట్లు అడిగిన ఓ డాక్టర్‌కు ఇండియాలో ఇలాంటి గతి పట్టిందంటూ.. అంతర్జాతీయ మీడియా అంతా ప్రముఖంగా చెబుతోంది. బీబీసీ వరల్డ్ తోపాటు.. బ్రిటన్ ఇతర పత్రికలు కూడా.. ప్రచురించాయి. సుధాకర్ ఎలాంటి మాటలైనా మాట్లాడి ఉండవచ్చు.. ఎలాంటి నేరం అయినా చేసి ఉండవచ్చు కానీ..పోలీసులు వ్యవహరించిన తీరు..మాత్రం… ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. పోలీసులు చెబుతున్నదానికి.. అక్కడ జరిగిన దానికి తేడా ఉండటంతో.. హైకోర్టు నిజానిజాల నిర్ధారణకు సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే.. దీన్ని తప్పు పడుతున్నారు ఆమంచి. ఆమంచి వ్యాఖ్యలు కోర్టును కించ పరిచడమేనని..సుమోటోగా కేసు నమోదు చేసి..చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఇతర పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరడంతో.. ఆయనకు ప్రాధాన్యం తగ్గింది.దీంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం కోసం ఆమంచి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఒక్క ఆమంచి మాత్రమే కాదు.. వైసీపీలోని పలువురు నేతలు.. వైసీపీకి చెందిన సోషల్ మీడియా టీం.. హైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదిస్తూ… ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు. ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తమకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే చాలు.. హైకోర్టుపైనా..కులం ముద్ర వేసే ప్రయత్నం చేయడం… కొత్త దుస్సంప్రదాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.