ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ఆయన సోదరుడు ఆమంచి స్వాములను పంపుతున్నారు. 12న మంగళగిరి లోని పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే పూజా సమయంలోనే జనసేన పార్టీలో చేరాలని ఆమంచి స్వాములు నిర్ణయించుకున్నారు. తర్వాత చీరాలలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తారు. ఆమంచి సోదరులు ఇద్దరూ కలసి కట్టుగానే రాజకీయాలు చేస్తారు. ఆమంచి కృష్ణమోహన్ రాజకీయం చేస్తే.. స్వాములు రౌడీయిజం చేస్తారు.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఆమంచి ఓడిపోయి.. చీరాలలో కరణం బలరాం టీడీపీ తరపున గెలుపు తర్వాత చీరాల రాజకీయం మారింది. ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైసీపీకి దగ్గరవడంతో ఆమంచికి చీరాలలో ప్రాధాన్యతను తగ్గించారు. అంతేకాకుండా కరణం బలరాం వర్గంతో విభేదాలు కూడా ఉన్నాయి. వైసీపీ అధిష్టానం చీరాలపై నియోజకవర్గాన్ని కరణం బలరాంకు అప్పగించింది. పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ను నియమించింది. అయితే తనకు పట్టు ఉన్న చీరాలలో కాకుండా.. టీడీపీ బలంగా ఉన్న పర్చూరులో తనకు సీటు ఎందుకని ఆయనంటున్నారు.
టీడీపీతో పొత్తు ఉంటే.. చీరాల సీటు కేటాయిస్తారన్న ఉద్దేశంతో .. సోదరులిద్దరూ మాట్లాడుకుని .. ముందుగా ఒకరు జనసేనలో చేరుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గతంలో ఆయన వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ముందు ఉండేవారు.