చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరిన ఒక్క రోజులోనే.. ఆమంచి వర్సెస్ కరణం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. స్థానిక ఎన్నికలు జరుగుతూండటమే దీనికి కారణం. చీరాల మున్సిపాలిటీలో అన్ని వార్డులకు అటు కరణం వర్గీయులు.. ఇటు ఆమంచి వర్గీయులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు బీఫాం ఎవరికి ఇస్తారన్నది పెద్ద వివాదం అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల విత్ డ్రా గడువుకు బీఫాం సమర్పించే అవకాశం ఉండటంతో.. మరో రెండు రోజుల తర్వాత బీఫామ్స్ పంపిమీ చేసే అవకాశం ఉంది.
అయితే.. అప్పటి వరకూ.. ఆమంచి, కరణం వర్గీయులు కామ్‌గా ఉండే అవకాశం లేదు. సాయంత్రం వరకు వేచి చూసే ధోరణిలో వైసిపి నేతలు ఉన్నారు. కార్యకర్తల్లోనూ.. ఈ వ్యవహరంపై అయోమయం నెలకొంది. పార్టీని నమ్ముకుని ఉన్న తమకు చివరి క్షణంలో అన్యాయం చేయబోతున్నారన్న ఆక్రోశం ఆమంచి వర్గీయుల్లో కనిపిస్తోంది. అధికార పార్టీ అనే హోదాను అడ్డుపెట్టుకుని ఆమంచి అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయనను కట్టడి చేయడానికే కరణం బలరాంను… ఆహ్వానించారన్న ప్రచారం.. చీరాలలో జోరుగా సాగుతోంది.
ఇలాంటి సమయంలో.. ఇప్పుడు ఆమంచి వర్గీయులు టిక్కెట్లు నిరాకరిస్తే.. ఆయనను పార్టీలో లైట్ తీసుకోవడం ప్రారంభించారని ప్రచారం ఉధృతం అవుతుంది. అందుకే ఆమంచి.. తన వర్గీయులకు బీఫాం ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో… నిన్ననే పార్టీలో చేరిన కరణం వర్గీయులకు బీఫాం ఇవ్వకపోతే.. వారు సహకరించే పరిస్థితి లేదు. దీంతో.. చీరాలలో… చేరిక సైడ్ ఎఫెక్ట్ మొదటగా కనిపించే అవకాశం ఉంది. రెండు రోజుల తర్వాత.. చీరాల వైసీపీలో రాజకీయం రాజుకునే అవకాశం కనిపిస్తోంది.