సమాజ్ వాదీ పార్టీలో చీలిక వచ్చింది. ములాయం సింగ్‌యాదవ్ సోదరుడు శివపాల్‌యాదవ్ సమాజ్‌వాది సెక్యులర్ఫ్రంట్ అనే సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి.. శివపాల్ యాదవ్ కొత్త పార్టీ పెట్టుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం.. శివపాల్ యాదవ్ వెనక్కి తగ్గలేదు. దీనికి కారణం.. తెర వెనుక నుంచి బీజేపీ నుంచి అందిన సహకారమే. ములాయం బ్రదర్స్‌కు అమర్ సింగ్ బాగా దగ్గర. అమర్ సింగ్.. అంటే అఖిలేష్‌కు పడదు. అసలు అమర్ సింగ్ వల్లే ..కుటుంబంలో గొడవలొచ్చాయన్న ప్రచారం కూడా ఉంది. ఈ అమర్ సింగ్ ఇటీవలి కాలంలో.. బీజేపీకి బాగా దగ్గరయ్యారు. అమర్‌సింగ్‌ను పావుగా వాడి… సమాజ్‌వాదీని పార్టీని చీల్చడంతో.. బీజేపీ చీఫ్ అమిత్ షా.. సక్సెస్ అయ్యారు.
శివపాల్ పార్టీని ప్రకటించడానికి ముందే ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నించారట. అలా అనడం కన్నా.. అమర్ సింగ్.. ఆయనను బీజేపీలో చేర్పించడానికి ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. కానీ శివపాల్ మాత్రం.. పార్టీనే పెట్టారట. ఈ విషయాన్ని వారే మీడియాకు వెల్లడించారు కూడా. శివపాల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి బదులు కొత్త పార్టీని ఆయనతో పెట్టిస్తే రానున్న ఎన్నికల్లో అఖిలేష్పార్టీని దెబ్బతీయవచ్చని బీజేపీ అగ్రనాయకత్వం అంచనా వేసిందని ప్రచారం జరుగుతోంది. విపక్షాల ఐక్యత కారణంగా యూపీలో పట్టు కోల్పోయిన బీజేపీ.. వారి ఓట్లను చీల్చితేనే బయటపడుతామని భావిస్తోంది. దానికి ములయం సోదరుడు ఓ పావుగా దొరికాడు.
పార్టీ నుంచి బయటకు వచ్చిన తనకు తన అన్న ములాయం సింగ్యాదవ్దీవెనలు ఉన్నాయని శివపాల్ చెబుతున్నారు. ఆయన దీవెనలు ఉన్నా లేకపోయినా, ఆయన పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరుతారనడంలో సందేహం లేదు. అందుకే అమిత్‌షా, పార్టీలో చేరడానికి తన వద్దకు ప్రతిపాదన తీసుకొచ్చిన శివపాల్యాదవ్కు ఏదో విధంగా నచ్చచెప్పి కొత్త పార్టీ ఏర్పాటుకు పురిగొల్పి ఉంటారు. ఎంతైనా కొత్త పార్టీలు పెట్టించి రాజకీయం చేయడంలో అమిత్ షా స్టైలే వేరు. ఏపీలోనూ ఆయన అదే స్టైల్ లో వెళ్తున్నారని.. ఇటీవల ప్రారంభమవుతున్న పార్టీలే చెబుతున్నాయంటున్నారు.