కాలుష్య పరిశ్రమ అంటూ మూసివేత ఉత్తర్వులు ఇచ్చి రాత్రికి రాత్రి కరెంట్ కూడా పీకేసిన అమరరాజా సంస్థ .. ఏపీ ప్రభుత్వానికి కోవిడ్ నివారణ సహాయ చర్యల కోసం సీఎంఆర్ఎఫ్కు రూ. కోటి విరాళం ఇచ్చింది. మంత్రి గౌతం రెడ్డి ప్రత్యేకంగా విరాళాల సేకరణ కోసం.. పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశానికి ప్రత్యేకంగా అమరరాజా సంస్థ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించారు. వారు వచ్చి…సీఎంఆర్ఎఫ్కు రూ. కోటి సమర్పించుకున్నారు. ప్రభుత్వం కూడా మొహమాటం లేకుండా ఆ చెక్కును తీసుకుంది. ఆ పరిశ్రమపై ఇంతకు ముందు వేసిన నిందలన్నింటినీ మర్చిపోయింది.
చిత్తూరు జిల్లాల్లో ప్రత్యక్షంగా పదహారు వేల కుటుంబాలకు.. పరోక్షంగా మరో ఇరవై వేల కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న అమరరాజా సంస్థ.. గత ముఫ్పై ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణలో అందరి మెప్పూ పొందింది. ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా పర్యావరణ అనుమతులు తీసుకుంటోంది. అయినా … గాలిలో … ఉద్యోగుల రక్తాల్లో సీఎం ఎక్కువుందన్న ..ప్రామాణికత పెద్దగా లేని రిపోర్టుల ఆధారంగా ప్రభుత్వం మూసివేత ఉత్తర్వులు ఇచ్చింది. కరెంట్ తీసేసింది. దీంతో నాలుగైదు రోజుల పాటు సంస్థ ఉత్పత్తి ఆగిపోయింది. రెండు ప్లాంట్లలోనూ ఉత్పత్తి నిలిచిపోవడంతో కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. తాము అన్ని రకాల పర్యావరణ అనుమతులు తీసుకున్నామని… నిబంధనలు అన్నీ పక్కాగా పాటిస్తున్నామని ఆధారాలు సమర్పించినా వినలేదు. చివరికి వారు కోర్టుకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటే తప్ప న్యాయం దక్కలేదు.
ప్రభుత్వం తమను వేధించిందని మనసులో పెట్టుకోకుండా.. ప్రజలకు కష్టం వచ్చిందని అమరరాజా సంస్థ రూ. కోటిని విరాళంగా ఇచ్చింది. అంతే కాదు.. తమ సంస్థ ఉన్న చిత్తూరు జిల్లా ప్రజలకు శక్తిమేర సేవ చేసేందుకు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆ సంస్థ పలు సేవా కార్యక్రమాలను చేస్తోంది. ప్రభుత్వం సమావేశాలు పెట్టి మరీ విరాళాలు సేకరిస్తోంది.. తాము వేధించిన కంపెనీల దగ్గరా తీసుకోవడానికి వెనుకాడటం లేదు.