తాము సేల్ డీడ్ అగ్రిమెంట్ ద్వారా ఏపీఐఐసీ దగ్గర భూములు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని.. ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని… ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీకి విక్రయించిందని.. ఏపీఐఐసి తమకు విక్రయించిందని.. ఒప్పందం ప్రకారం… తాము కల్పిస్తామని చెప్పిన ఉద్యోగాల కన్నా ఎక్కువే కల్పించామని హైకోర్టు దృష్టికి అమరరాజా సంస్థ తీసుకెళ్లింది. దీనిపై ప్రభుత్వ వాదన భిన్నంగా అందులో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తామని చెప్పి … ఏర్పాటు చేయలేదని.. అందుకే భూములను వెనక్కి తీసుకునే అధికారం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇంకా ఉల్లంఘనలు ఉన్నాయని… విడిగా వివరణ పత్రం దాఖలు చేస్తామని కోర్టుకు తెలపడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.
చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు గతంలో కేటాయించిన భూములను రద్దు చేస్తున్నామంటూ.. ఏపీ సర్కార్ ప్రకటించి.. జీవో విడుదల చేసింది. అయితే.. అసలు అవి తమకు ప్రభుత్వం కేటాయించలేదని.. ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశామని అమరరాజా వాదిస్తోంది. అదే సమయంలో… ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసేటప్పుడు చేసుకున్న ఒప్పందంలో ఉన్న అన్ని అంశాలను.. ఉద్యోగాలతో సహా నెరవేర్చామని స్పష్టం చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం… చెప్పినన్ని ఉద్యోగాలు కల్పించలేదని వాదిస్తోంది. ఈ విషయంలో ఏమైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటే.. ఏపీఐఐసీ ద్వారా తీసుకోవాల్సి ఉన్నా.. నేరుగా ప్రభుత్వం రంగంలోకి దిగింది.
అన్ని వ్యవహారాలు సేల్ డీడ్ ద్వారా జరిగాయని అమరరాజా వాదిస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో.. ప్రభుత్వం రద్దు ఉత్తర్వులు చెల్లవంటోంది. చెల్లుతాయని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఎందుకంటే.. ఏపీఐఐసికి భూములు ఇచ్చింది ప్రభుత్వమే కాబట్టి… ఆ ఏపీఐఐసీ ఇతరులకు ఇచ్చిన భూములను రద్దు చేయడం ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని.. వాదించారు. ఈ వాదన కాస్త చిత్రంగా ఉన్నప్పటికీ.. సమర్థించుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరరాజా అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని.. ప్రభుత్వం చెబుతూంటే.. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని.. కావాలంటే.. అడ్వకేట్ జనరల్‌ను తీసుకెళ్లి మొత్తం చూపిస్తామని ఆ సంస్థ చెబుతోంది. ఏ ఉల్లంఘనలు చెప్పి భూములు రద్దు చేశారో.. ఇప్పుడు.. ఆ ఉల్లంఘనలను నిరూపించాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై పడింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే భూములను రద్దు చేశారని ఆరోపణలు వస్తున్న సమయంలో.. ఈ విషయంలో ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురవుతోంది.