ప్రేమలో మొదలుపెట్టడాలూ, మధ్యలో ఆపేయడాలూ ఉండవు. ఓసారి ప్రేమిస్తే.. ప్రేమిస్తూ ఉండడమే. అది తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమ కావొచ్చు. భార్యాభర్తల ప్రేమ కావొచ్చు. అబ్బాయి, అమ్మాయి ప్రేమ కావొచ్చు. ప్రేమలో క్షమా గుణం కూడా ఉండాలి. లేదంటే అది ప్రేమే కాదు. అలా కూతురు చేసిన చిన్న తప్పుని క్షమించలేని ఓ తండ్రి కథ. తండ్రి ప్రేమ కోసం తన ప్రేమనే దూరం చేసుకున్న ఓ కూతురి కథ. ప్రేమించి అమ్మాయి కోసం తన ప్రేమనే వదిలేసిన ఓ ప్రేమికుడి కథ ‘అమరం అఖిలం ప్రేమ’. లాక్ డౌన్ సమయంలో థియేటర్లన్నీ మూతబడిన వేళ.. ఓటీటీ వేదిక ‘ఆహా’లో విడుదలైంది. ఈరోజే.
అరుణ్ ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగర్)కి తన కూతురు అఖిల (శివ శక్తి) అంటే వల్లమాలిన ప్రేమ. అది ఎంతంటే… కూతురు మరో అరగంట ఎక్కువ పడుకోవాలని స్కూలు టైమింగ్సే మార్చమని ప్రిన్సిపాల్ ని కోరేంత. ఆ కూతురికీ అంతే. స్కూల్లో అబ్బాయి ఇచ్చిన ప్రేమలేఖని నాన్నకి చూపించి మరీ మురిసిపోయేంత ప్రేమ. అయితే…. అఖిల చేసిన ఓ పొరపాటు, తప్పు.. తండ్రీ కూతుర్ల మధ్య దూరం పెంచుతుంది. తండ్రి కోసం ఆ ఊరిని, తన ఇష్టాన్నీ వదిలి.. ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తుంది అఖిల. ఇక్కడ అమర్ (విజయ్ రామ్) పరిచయం అవుతాడు. అఖిలని తొలి చూపులోనే ప్రేమిస్తాడు అమర్. అఖిల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఆఖరికి తన ప్రేమనే త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదెలా అన్నదే – అమరం.. అఖిలం.. ప్రేమ.
ప్రేమ ఉంటే.. క్షమించే గుణం కూడా ఉంటుంది. క్షమించే గుణం ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది. ఈ డైలాగే ఈ కథకు మూలం. కూతురు చేసిన తప్పుని తండ్రి క్షమించకపోవడమే ఈ కథలో కాన్ల్ఫిక్ట్. తండ్రి అతి ప్రేమ వల్ల – దాంతో కూతురు తన ప్రేమని వదులుకోవడం `నువ్వే నువ్వే` కాన్సెప్ట్. దానికి మరికొంత ఎమోషన్ జోడించారు ఈ సినిమాలో. ఓకూతురిపై తండ్రి చూపించిన అతి ప్రేమతో సినిమా మొదలవుతుంది. అవన్నీ.. `ఆకాశమంత`, `నువ్వే నువ్వే` లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. బహుశా తండ్రి ప్రేమంటే.. అలానే ఉంటుందేమో..? ఆ తరవాత అమర్ ప్రేమ మొదలవుతుంది. అమర్ .. అఖిలని ఇంప్రెస్ చేయడానికి, తననే రోజూ చూస్తూ ఉండడానికి చేసే ప్రయత్నాలు సరదాగానే ఉన్నా, తప్పకుండా అవన్నీ పాత సినిమాల్ని గుర్తు కు తెస్తుంది. తన తండ్రిని ఎందుకు వదిలేసి రావాల్సివచ్చిందో.. చెప్పేంత వరకూ కథలో ఎమోషన్ పార్ట్ ప్రవేశించదు. ఆ తరవాత.. త్యాగాల డ్రామా మొదలవుతుంది. అఖిల తండ్రి కోసం.. అమర్ తన ప్రేమని త్యాగం చేస్తే, ఐఏఎస్ కోసం అఖిల అమర్‌ని త్యాగం చేస్తుంది. చివరికి ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించే ఉంటాడు.
చిన్న కథ ఇది. ఇలాంటి కథల్ని నడిపించడానికి సన్నివేశాల్లో బలం ఉండాలి. ఎమోషన్స్ పండాలి. దాని కోసం దర్శకుడు చేసిన కృషి అంతంత మాత్రంగానే ఫలించింది. కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నా – మరి కొన్ని సన్నివేశాలు రొటీన్ గా, ఓవర్ మెలోడ్రామాతో సాగుతుంటాయి. ఓ సందర్భంలో తండ్రే విలన్ గా కనిపిస్తాడు. క్షమించలేకపోవడానికి కూతురు చేసిన తప్పేంటి? అనిపిస్తుంది. ఇదంతా.. కథని క్లైమాక్స్ వరకూ లాగడానికి పడిన ఇబ్బందే. కాకపోతే.. ఈనాటి ప్రేమకథల్లా మలినం లేని కథ ఇది. లిప్ లాక్లూ, మందుబాటిళ్లూ కనిపించని కథ కథ కూడా ఇదేనేమో. రాసుకున్న కథని నిజాయతీగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు.
ప్రేమకథలకు కెమిస్ట్రీ చాలా అవసరం అని విశ్లేషకులు చెబుతుంటారు. దాన్ని దర్శకుడు పట్టించుకోలేదు. అఖిలగా నటించిన అమ్మాయి చూడ్డానికి బాగుంది. నటనా ఓకే. కానీ.. అమర్ తేలిపోయాడు. అమర్ స్థానంలో మరో హీరో ఉంటే బాగుండేది. కాకపోతే నటన పరంగా శివ చేసిన తప్పులేం లేవు. ఈమధ్య ఎక్కువగా నెగిటీవ్ పాత్రలే పోషిస్తున్న శ్రీకాంత్ అయ్యంగర్… పాజిటీవ్ పాత్రలో కనిపించాడు. తన సహజమైన నటన రక్తి కట్టింది. అన్నపూర్ణ లాంటి సీనియర్ నటిని ఈమధ్య ఇంతిలా ఏ కథలోనూ వాడుకోలేదు. ఆమె తన అనుభవాన్ని రంగరించింది. నరేష్ సరేసరి.
రసూల్ ఫొటోగ్రఫీ, రథన్ నేపథ్య సంగీతం పాటలు.. ఈ కథని నిలబెట్టే ప్రయత్నం చేశాయి. మాటలు అక్కడక్కడ నచ్చుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కి ముందు సన్నివేశాల్ని బాగా కన్వెన్స్గా రాసుకోగలిగాడు దర్శకుడు. లాక్ డౌన్ సమయం.. అందులోనూ…ఇంట్లో కూర్చుని చూసే వీలు దొరికింది. ఈ సమయంలో `అమరం. అఖిలం..` కాస్త కాలక్షేపాన్ని కలిగిస్తుంది. కాకపోతే.. ట్రిమ్ చేసుకుని, షార్ప్‌గా కట్ చేయగలిగితే… మరో అరగంట సాగదీత తప్పేది.