Amaran Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-
సినిమాల్లో దేశభక్తిని మించిన కమర్షియల్ జోనర్ ఉండదేమో? థియేటర్లో `ఇది మన సినిమా… మనందరి సినిమా` అనే ఫీలింగ్ కేవలం ఈ తరహా చిత్రాలే క్రియేట్ చేయగలవు. అది క్రికెట్ నేపథ్యం కానివ్వండి, జవాన్ కథ కానివ్వండి, ఓ దేశ భక్తుడి జీవితం కానివ్వండి. కనెక్టింగ్ గా చెప్పగలగాలంతే. కాసులు కురుస్తాయి. అందుకే అడపాదడపా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా వీర సైనికుల విజయగాథలు సినిమాలకు మంచి ముడిసరుకులు. ‘ఉరి’, ‘మేజర్’ లాంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకొన్న తరవాత, ఇలాంటి కథలపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు వచ్చిన ‘అమరన్’ కూడా అలాంటి కథే. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కిన చిత్రమిది. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం, శివ కార్తికేయన్, సాయి పల్లవి లాంటి ప్రతిభావంతులు నటించడం, దేశభక్తి కథ కావడంతో ‘అమరన్’పై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా వుంది? ఈ దేశం కోసం ముకుందర్ వరదరాజన్ చేసిన సేవలేంటి? కమర్షియల్ మీటర్ లో చూస్తే ఈ సినిమా అనుకొన్న ఫలితాన్ని చేరుకొంటుందా, లేదా?
ముకుంద్ (శివ కార్తికేయన్)కు చిన్నప్పటి నుంచీ ఆర్మీలోకి వెళ్లాలని కలలు కంటుంటాడు. అమ్మకు ఇష్టం లేకపోయినా ఆర్మీ ఆఫీసర్ అవుతాడు. కాలేజీ రోజుల్లోనే ఇందు (సాయిపల్లవి)తో ప్రేమలో పడతాడు. ఇందు అమ్మానాన్నలు మాత్రం ఓ మిలటరీవాడికి మా కూతుర్ని ఇవ్వమంటూ అడ్డుపడతారు. మరోవైపు కాశ్మీర్లో తీవ్రవాదుల్ని పట్టుకొనే ప్రయత్నంలో భాగంగా ముకుంద్కు రకరకాల ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా హిజ్బూల్ మొహాయుద్దీన్ గ్రూపు యాక్టివిటీస్ ప్రమాదకరంగా మారడంతో, ఆ గ్రూపుకు అడ్డుకట్టవేయడానికి ముకుంద్ టీమ్ సమాయాత్తం అవుతుంది. మరి ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? ఇందుతో ప్రేమకథ ఏ మలుపు తీసుకొంది? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
కేవలం 31 ఏళ్ల వయసులోనే దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఓ అమరుడి కథ ఇది. ఇలాంటి కథలెప్పుడు విన్నా, ఎన్ని చూసినా గుండె బరువెక్కిపోతుంది. దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన ఇలాంటి వీర జవాన్లకు ఏం చేయగలం? సెల్యూట్ తప్ప? అయితే ఈ కథలు రేపటి పౌరులపై చెరగని ముద్ర వేయగలవు. ఆర్మీ అంటే ఉద్యోగం కాదని, దేశానికి సేవ చేసే అద్భుతమైన అవకాశమని చెప్పే సందర్భాలు ఇలాంటి కథలద్వారానే వస్తాయి. `ట్రూస్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలటరీ హీరోస్` అనే పుస్తకం ఆధారంగా రాసుకొన్న కథ ఇది. బయోపిక్ కాబట్టి, దర్శకుడు అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని ఉండొచ్చు. కొన్ని చోట్ల సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కంటే డాక్యుమెంటరీ చేసిన ఫీలింగ్ కలుగుతుంటుంది. నిజ జీవిత కథలు సినిమాలుగా తెరకెక్కిస్తున్నప్పుడు ఉండే ఇబ్బందే ఇది. ‘అమరన్’లో కూడా అది కనిపిస్తుంది.
అయితే ఇది ముకుంద్ కథగా కంటే, ఇందు కథగానే తీర్చిదిద్దడం మంచి ఎత్తుగడ. ఇందు ఆలోచనల్లోంచి కథ మొదలవుతుంది. దాంతో.. దీనికో లవ్ స్టోరీ కలరింగు వచ్చింది. ఇందు-ముకుంద్ ప్రేమ కథ చాలా మెచ్యూర్డ్ గా, అందంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. సాయి పల్లవి నటన వల్ల, ప్రేమకథలో చూపించిన డిగ్నిటీ వల్ల ఆ ఎపిసోడ్ మరింత రక్తి కట్టింది. ముకుంద్ అమ్మ పాత్రని చాలా లైవ్లీగా తీర్చిదిద్దారు. ఆపాత్ర వల్ల కొంత ఫన్ కూడా పుట్టింది. ఇందు క్యారెక్టరైజేషన్ వల్ల ఈ కథకు కొత్త డెప్త్ వచ్చింది.
ఈతరహా కథలెలా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశం కోసం కుటుంబాన్నీ, జీవితాన్నీ త్యాగం చేయడం ఎలా ఉంటుందో, అందులో ఎంత పెయిన్ ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. ఆ ఎమోషన్ అర్థం చేసుకోగలం. ఇలాంటి సీన్లు ఈ సినిమాలోనూ ఉంటాయి. అవన్నీ చూస్తుంటే `దేశం కోసం సైన్యం ఎంత త్యాగం చేస్తోందో` అంటూ మరోసారి మనసు భారంగా మూలుగుతుంది. సైనికుల కథలన్నీ రొటీన్ గా సాగేవే. కాకపోతే ఆ రొటీన్ జీవితమే.. సరిహద్దులోపల ప్రజలకు కంటి నిండా కునుకు అందిస్తోంది. ముకుంద్ జీవితంలోనూ పెద్దగా ట్విస్టులు ఉండవు. 31 ఏళ్లకే తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడన్న పాయింట్ తప్ప. ఆ పాయింట్ మాత్రం హృద్యంగా, మనసును హత్తుకొనే తీశాడు దర్శకుడు. సెకండాఫ్ బాగా స్లోగా నడిచింది. క్లైమాక్స్ లో మళ్లీ కాస్త కదలిక కనిపిస్తుంది. చివర్లో సాయి పల్లవి నటన వల్ల.. ఆయా సన్నివేశాలు మరింత బరువెక్కిస్తాయి.
శివ కార్తికేయన్, సాయిపల్లవి.. ఇద్దరూ కథల్ని నమ్మే వ్యక్తులే. వాళ్లకు పాత్ర నచ్చితే చాలు. ఏమైనా చేస్తారు. ఈ సినిమాలోనూ అదే కనిపించింది. శివ కార్తికేయన్ నటనలో ఎక్కడా వంక పెట్టలేం. ముకుంద్ పాత్రలో ఒదిగిపోయాడు. నిజమైన సోల్జర్లా కనిపించాడు. సాయి పల్లవి అయితే ఎప్పటిలానే కళ్లతో నటించేసింది. తన కనుబొమ్మలూ, ఆఖరికి కన్నీళ్లూ కూడా నటించాయి. క్లైమాక్స్ అంతా తనదే. ఓ ఆర్మీ ఆఫీసర్ భార్యగా ఉండడం ఎంత క్లిష్టమో.. ఈ సినిమాలో ఇందు పాత్రని చూస్తే అర్థం అవుతుంది. సాంకేతికంగా చూస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్బుల్ గా ఉంది. యాక్షన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని సహజంగా చిత్రీకరించారు. దర్శకుడు రాజ్ కుమార్ పెరిస్వామి ముకుంద్ జీవితంపై బాగానే పరిశోధన చేసినట్టు అర్థం అవుతోంది. పాత్రల ద్వారా తనకేం రావాలో అది రాబట్టుకోగలిగారు. ప్రధమార్థంలో పెద్దగా కంప్లైంట్స్ లేవు. ద్వితీయార్థం మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. క్లైమాక్స్ లో మళ్లీ ఎమోషన్ టచ్ చేయగలిగాడు.
ఉరి, మేజర్ లాంటి సినిమాలు బాగా ఆడాయంటే కారణం.. ఆయా ఘటన పూర్వాపరాలు మనకు బాగా తెలుసు. త్వరగా కనెక్ట్ అయిపోయే పాయింట్. ముకుంద్ కథలో అలాంటి రెడీమెడ్ కనెక్టింగ్ పాయింట్ ఉండదు. లక్ష్యం ఏమిటి? ఎవర్ని టార్గెట్ చేయాలి? అనే విషయంలో స్పష్టత కనిపించదు. దాంతో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. కాకపోతే ఓ సైనికుడి కథని, ఆ కోణంలోనే చూస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది.
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-