ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఉన్న గందరగోళం అంతా తీరిపోయింది. ప్రజలు అమరావతే రాజధాని అని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అమరావతే రాజధాని అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీకి విజయం దక్కింది. మూడు రాజధానుల విధానంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ పరాజయం ఎదురైంది. అమరావతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి విధానాన్ని ప్రజలు అంగీకరించలేదని స్పష్టమయింది.
మూడు రాజధానులను నిర్ణయించినప్పుడు ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ప్రతిపక్షాలు సవాల్ చేశాయి. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు ఎన్నికల్లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. నిజానికి మూడు రాజధానుల ఎజెండాతో జగన్ గెలిచినా రాజధానిని మార్చలేరు. చట్టప్రకారం సాధ్యం కాదు అసెంబ్లీలో చట్టం చేసినా సాధ్యం కాదు. అయినా ప్రజల్నిమోసం చేయాలనుకున్నారు. ఇప్పుడు తాము అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని టీడీపీ చెబుతుంది కాబట్టి.. ఏ సమస్యలూ ఉండవు.
వైసీపీ సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడంతో ప్రజల్లోనూ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. విశాఖలో బహిరంగసభలు పెట్టినా జగన్ విశాఖ రాజధాని అని పెద్దగా చెప్పుకోలేకపోయారు. ఆ అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చలేకపోయారు. మద్దతు రాదనే అలా చేశారు. చివరికి ప్రజలమద్దతు రాలేదు. ఆయన పార్టీ ఓడిపోయింది. ప్రజలు అమరావతికే ఓటేశారు. అమరావతినే రాజధాని అంటున్న టీడీపీ ఇప్పుడు ఐదేళ్లలో దాన్ని పూర్తి చేసి చూపించాల్సిన అవసరం పడింది.