రాజధాని నిర్మాణం తీరు తెన్నుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం విభేదిస్తోంది. ఈ విషయాన్ని అందరికంటే ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సూచించారు. అందుకు కృతజ్ఞతలు తెలియచేసినప్పటికీ ఆ సలహాను మాత్రం చంద్రబాబు పట్టించుకోలేదు.
సింగపూర్ తరహా రాజధాని నిర్మాణానికి ఆదేశ విదేశాంగమంత్రి నాయకత్వంలో అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధుల బృందం గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో కేంపుచేసి వున్న ముఖ్యమంత్రిని కలిసి ప్లానులు అందచేశారు. ముఖ్యమంత్రికి ప్రధాని రాసిన ఉత్తరం అంతకు రెండురోజుల క్రితమే చేరింది. “మధ్య ఆసియాలో చిన్న చిన్న దేశాల రాజధానులు బాగున్నాయి. కిజికిస్ధాన్ రాజధానిని స్వయంగా చూశాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని ని నిర్మించడానికి ఆ రాజధానులను పరిశీలించి రండి” అని ప్రధాని రాశారు. రాజమండ్రిలో జరిగిన కేబినెట్ సమావేశంలో సింగపూర్ ప్లానులను ఆమోదిస్తూ తీర్మానించారు. ప్రధాని రాసిన లేఖను సమావేశంలో చదివి వినిపించారు. సలహా ఇచ్చిన మోదీకి కృతజ్ఞతలు చెబుతూ మరో తీర్మానం చేశారు.
అయితే, ప్రధాని సూచించిన విధంగా మధ్య ఆసియా దేశాల రాజధానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించనేలేదు. రాజధాని ఎలావుండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రప్రభుత్వానిదే అయినప్పటికీ కేంద్రసహాయం కూడా ఇందులో ఇమిడి వుండటం వల్ల కేంద్రం సలహాలు ఇవ్వడమే కాక తను ఇచ్చిన డబ్బుకి అకౌంట్ కూడా అడుగుతుంది. రాజధాని ఎలా వుండాలో ఫిక్స్ అయిపోయిన చంద్రబాబు ప్రధానికి కృతజ్ఞతలు రికార్డు చేసి ఆయన సూచనను మాత్రం పక్కన పెట్టేశారు. ఇందువల్లో ఏమో “ఢిల్లీకి మించిన రాజధాని మీకు వస్తుంది” అని ఓట్లు అడిగిన తిరుపతి సభలో ఉత్సాహపరచిన నరేంద్రమోదీ తన మాటనూ పక్కన పెట్టేశారు.
ఆమరావతి నిర్మాణంలో ప్రజల్ని ఎమోషనల్ గా ఇన్వాల్వ్ చేయడానికి ప్రతి ఒక్కరూ నీరూ, మట్టీ తీసుకురావాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు ప్రధాని స్పందించారు. స్వయంగా మట్టీ, నీరూ తెచ్చి చేతులు దులిపేసుకున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రసహాయాన్న శంకుస్ధాపన సభలో ప్రధాని ప్రకటిస్తారని ఆశించిన రాష్ట్రప్రభుత్వం, ప్రజలు షాకయ్యారు. మట్టీ నీరు ఇవ్వడమంటే “మీ ఏడుపు మీరు ఏడవండి” అన్న నిగూఢ సందేశమేనని అప్పట్లో అర్ధం కాలేదు.
పెట్టుబడుల కోసం చంద్రబాబు ఆయన బృందాలు చేసిన విదేశీ పర్యటనలు, అక్కడ వారు చూపిన ”అత్యుత్సాహం”, ఆ వివరాలను కేంద్రానికి వివరించకుండా నేరుగా మీడియాకు వెల్లడించడం ప్రోటోకాల్ మర్యాదల రీత్యా అభ్యంతరకరమని విదేశీ వ్యవహారాల శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి వివరించినట్టు తెలిసింది. సింగపూర్ ప్రధాని అంత్యక్రియలకు హాజరవ్వడానికి చంద్రబాబు సిద్ధమైనపుడు ”ఈ దేశ ప్రతినిధిగా ప్రధాని హాజరౌతున్నపుడు ఏహోదాలో మీరు వెళ్తారు” అని నిలదీయడానికి అదే కారణమని అర్ధమౌతోంది.
”వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ది, హైదరాబాద్ అనుభవం తరువాతైనా బుద్ధితెచ్చుకోకపోతే ఎలా” మొదలైన విమర్శలను కన్నా లక్ష్మీ నారాయణ, పురంధరేశ్వరి, సోము వీర్రాజు వంటివారు చేసిన ప్రతి సందర్భంలోనూ వారు తెలుగుదేశం, చంద్రబాబు వ్యతిరేకులు కాబట్టి అలాగే అంటారు. వీళ్ళతో మనకి పని లేదు డిల్లీ నాయకులతోనే మాట్లాడుదాం” అనే ధోరణినే చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్లంతా ప్రదర్శిస్తూనే వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ బిజెపి పాత ఇన్ చార్జ్, జవదేకర్, ప్రస్తుత ఇన్ చార్జ్ సిద్దార్ధనాధ్ సింగ్ లతో చంద్రబాబుకి, లేదా తెలుగుదేశంలో సీనియర్లకు వ్యక్తిగత సాన్నిహిత్యాలు లేవు. పెంచుకోడానికి ప్రయత్నం చేయకపోవడం తెలుగుదేశం వైపు పెద్దలోపం, వైఫల్యం.
వ్యక్తిగత సాన్నిహిత్యాలు లేకపోవడం వల్ల బిజెపి అగ్రనాయకులతో, కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి సంబంధాలు కేవలం ఫార్మల్ మీటింగులుగా నే మిగిలిపోయాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు కష్టసుఖాలు చెప్పుకోగల మిత్రుడు, బిజెపి అగ్రనాయకుడు, తన శాఖద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఇంతకు ముందు ఎవ్వరూ ఇవ్వనన్ని నిధులు ఇస్తున్న పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అనేక విషయాలను ”క్లియర్” చేశారు.
”రాజధాని అంటే శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, సెక్రటేరియట్ తప్పక వుండాలి. సింగపూర్ లాంటి రాజధానులు కట్టుకోవాలన్న ఆశ తప్పుకాదు కాని అది ఇప్పట్లో జరిగే పని కాదు. అన్నీ హైదరాబాద్ లో కేంద్రీకరించడం వల్ల విభజన సందర్భంగా ఏర్పడిన సమస్యలు చూస్తున్నాము. వాటిని మనమే మొయ్యాలి. మళ్ళీ అన్నీ అమరావతిలోనే పెడతామనడం కరెక్టుకాదు. వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధిలో సమతూకం అనే సూత్రానికే బిజెపి కట్టుబడి వుంది….14 వఆర్ధిక సంఘం కేటాయింపుల వల్ల రాష్ట్రాల వాటా బాగా పెరుగుతూంది. ఇందువల్ల ప్రత్యేక హోదా సాధ్యం కాదు. ఇపుడు మనకు కావలసింది ప్రత్యేక సహాయం” అని వెంకయ్య నాయుడు నిన్న టివి ఇంటర్యూలలో స్పష్టం చేశారు.
బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య, ఆంధ్రప్రదేశ్, కేంద్రప్రభుత్వాల మధ్య, చంద్రబాబు, నరేంద్రమోదీల మధ్య సామరస్యత వుండవలసినంత లేకపోవడానికి మూలం రాజధాని నిర్మాణం మీద వున్న ఆలోచనల తేడాలు, అభిప్రాయ బేధాలేనని వెంకయ్య నాయుడు తెలుగుదేశం మహానాడు మొదటిరోజున ఢిల్లీనుంచే టివి ఇంటర్యూ ద్వారా క్లియర్ చేసేశారు.