గుంటూరు జిల్లా చినకాకానిలో జరిగిన చేనేత గర్జన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తనదైన శైలిలో చేనేత కార్మికుల కష్టాల గురించి మాట్లాడారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, నేతన్నల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేత కార్మికులు అంటే ఒప్పుకోననీ, కళాకారులు అనాలని చెప్పారు. తాను కోరుకుంటే కోట్ల రూపాయలు సంపాదించే కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగలననీ, అలా చేయడం వల్ల నేతన్నల కష్టాలు తీరేవి కావని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, నేత కార్మికుల వాణిని చట్టసభలో వినిపిస్తానని అన్నారు. ప్రత్యేక హోదా గురించి పవన్ మాట్లాడారు. ఎందుకు ఇవ్వడం లేదో కేంద్రం చెప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు రాజధాని ప్రాంత రైతులు పవన్ కల్యాణ్‌ను కలిశారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతులు ఫిర్యాదు చేశారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి రైతులు తమ కష్టాలను పవన్‌కు వివరించారు. నిజానికి, రాజధాని ప్రాంతంలో భూసేకరణ అంతా రైతుల అనుమతితోనే జరుగుతోందని ఓ పక్క ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. ఈ నేపథ్యంలో పవన్ ముందుకు రైతులు రావడం గమనార్హం! ఇప్పుడు ఈ విషయమై పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.
గతంలో రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై పవన్ తీవ్రంగానే స్పందించారు. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో పర్యటించి, రైతులతో ప్రజా వేదికలు ఏర్పాటు చేశారు. బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటే తాను సహించననీ, ఉద్యమిస్తానంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగాల్సి వచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఆ తరువాత, పవన్ కల్యాణ్ కూడా ఆ ఇష్యూ గురించి పట్టించుకున్నది లేదు! కానీ, భూసేకరణ యథాతథంగా సాగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పవన్ కల్యాణ్ ఉద్యమాల ట్రాక్ రికార్డ్ ఒక్కసారి పరిగణనలోని తీసుకుంటే, ఒక సమస్య మీద ఒకసారి మాత్రమే పవన్ స్పందిస్తారు! మొన్నటి విశాఖలోని ప్రత్యేక హోదా ఉద్యమం తీసుకుంటే.. తరువాతి కార్యాచరణ ఏంటో ప్రకటించలేదు! అంతకుముందు ఉద్దానం బాధితుల ఇష్యూలో కూడా అంతే. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటున్నా కూడా దాని గురించి మళ్లీ మాట్లాడటం లేదు. తొందుర్రు ఆక్వారైతుల సమస్య కూడా ఇంతే! ఆ ప్రాంతంలో పవన్‌ను నమ్ముకుని ఉద్యమిస్తున్న యువత ఇబ్బందులు పడుతున్నట్టు కథనాలు వస్తున్నాయి! వాటిపై పవన్ స్పందన కరువే. ఇప్పుడు రాజధాని రైతుల ఇష్యూ మళ్లీ పవన్ దగ్గరకే వచ్చింది! ఈ నేపథ్యంలో పవన్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి