ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సిఆర్ డిఎ (కేపిటల్ రీజియన్ డెవలప్ మెంటు అధారిటీ) అధికారులు తలవంచుకుంటున్నారు. లాండ్ పూలింగ్ సమయంలో మాకు ఇళ్ళస్ధలాలు మా గ్రామంలోనే ఇస్తామన్నారు. ఇప్పుడు కుదరదంటున్నారు ఇలా మోసం చేస్తే ఎలా అని మందడం గ్రామ రైతులు సిఆర్ డిఎ కార్యాలయం వద్ద అధికారులను ప్రశ్నించారు. అలా ఇస్తే మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది కనుక ఇచ్చినచోటే స్ధలాలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. దీంతో రైతులు మాస్టర్ ప్లాన్ కాపీలను చించివేశారు. తాము ఇచ్చిన భూముల్ని దున్నేసి సాగు చేసుకుంటామని వెళ్ళిపోయారు.
రాజధానికి పునాది వేశాక ఆ ప్రాంతంలో భూమి మార్కెట్ విలువ పెరిగింది. అయితే రాజధానితో తమకు సంబంధం వుండదని తెలియడంతో క్రమంగా వారిలో రాజధానిపై వ్యతిరేకత మొదలైంది. మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్‌తో అది ఆగ్రహంగా మారింది. ఇప్పుడు ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు.
ప్రభుత్వ హమీలేమీ అమలుకాకపోగా జరీబులో భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో భూములు కేటాయించాలని నిర్ణయించడం, వేలకోట్లతో నిర్మిస్తామని చెబుతున్న రాజధాని తొలి తాత్కాలిక నిర్మాణానికే అప్పు తీసుకోవాలని నిర్ణయించడం వంటి విషయాలతో రైతుల్లో అనుమానాలతోపాటు ఆగ్రహమూ పెరుగుతోంది.
మాస్టర్‌ప్లాన్‌పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో అన్ని గ్రామాల్లోనూ ఇవే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
మాస్టర్‌ప్లాన్‌లో తమకు కేటాయించాల్సిన ప్లాట్లు చూపలేదని, నమ్మి భూములిస్తే నట్టేట ముంచుతారా ? అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గుంటూరులో జరిగే సమావేశంలో దీనిపై అధికారులను ప్రశ్నిస్తామని, తమకు అనుకూలంగా సమాధానం రాకపోతే భూముల్లో సాగుచేపడతామని రైతుల ప్రతినిధి సాంబయ్య చెప్పారు.
ఎర్రబాలెంలో గ్రామకంఠాల సమస్య ఎక్కువగా ఉంది. అక్కడ సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామకంఠాల్ని పొలాల కింద చూపి, ఆయా సర్వేనెంబర్లకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీంతో ఆగ్రామంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సమస్యను పరిష్కరిస్తామని చెప్పి, ఇంతవరకు పరిష్కరించలేదని ఆ గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
తాము భూములివ్వలేదనే ఉద్దేశంతోనే తమపరిధిలో సీవరేజ్ ట్రీట్మెంటు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఉండవల్లి గ్రామస్థులంటున్నారు. తాము భూములివ్వకపోయినా తమ భూముల నుంచి రోడ్లు ఎలావేస్తారని పెనుమాక రైతులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జన్మభూమిలో అధికారులను నిలదీయడంతో సమాధానం చెప్పలేక వెనుదిరిగారు.
కృష్ణాయపాలెంలో రైతులు జన్మభూమిని బహిష్కరించారు. రోడ్డుపేరుతో తమగ్రామాన్ని సగం ఎత్తేస్తున్నారని, దీన్ని వెంటనే విరమించుకోవాలని అక్కడి రైతులు డిమాండ్ చేశారు. జన్మభూమి జరిగే భవనానికి తాళం వేసి అధికారులను పంపించేశారు. లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాల్లోని రైతులు కూడా భూములివ్వలేదు. అయినా ఆయా ప్రదేశాల్లోనూ సీడ్ డెవలప్మెంట్ ప్రాంతాన్ని ప్లాన్‌లో ఎలా చూపించారని రైతులు సిఆర్డిఏ అధికారులను ప్రశ్నించారు.
రాజధాని నగరాన్ని తమ వద్ద కడుతూ తమను దూరంగా వెళ్లిపోమంటే ఎలాగని ప్రశ్నించారు. తమ భూముల్లో వెంటనే పంటలసాగు చేపడతామని చెప్పారు. దీంతో అధికారులూ ఏమీ చెప్పలేని పరిస్థితేర్పడింది. భూములు తీసుకోవడం మినహా అధికారులు చేసిందేమీ లేదని, తాత్కాలిక రాజధాని నిర్మాణానికి అప్పు తీసుకుంటున్న ప్రభుత్వం శాశ్వత రాజధాని ఎప్పటికి ఎలా నిర్మిస్తుందనీ కొందరు ప్రశ్నిస్తున్నారు.