అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఆంక్షలు సడలించడానికి హైకోర్టు నిరాకరించడం కేవలం ఆరు వందల మంది రైతులు మాత్రమే పాల్గొనాలని మద్దతిచ్చే వారు కలిసి నడవకూడదని.. రోడ్డు పక్కన ఉండాలని చెప్పడంతో రైతులు నిరాశకు గురయ్యారు. తర్వాత రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌కూ హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. దీంతో రైతులు పాదయాత్ర ప్రారంభంపై ఇంకా ఎలాంటిప్రకటన చేయలేదు. ఖచ్చితంగా పాదయాత్ర చేస్తామని ప్రకటించారు కానీ.. ఎప్పటి నుంచన్న దానిపై స్పష్టత లేదు.
అయితే ఢిల్లీ వేదికగా తమ వాదన వినిపించాలన్న ఆలోచనకు మాత్రం వచ్చారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఢిల్లీ వేదికగా నిరసనలు తెలపాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే ఢిల్లీలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 17,18 తేదీల్లో జంతర్‌మంతర్‌లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
డిసెంబర్ 7 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అమరావతి రైతులు నిర్ణయించారు. ఢిల్లీలో ధర్నా పూర్తయిన తర్వాత రైతులు… ఏపీలో చేపట్టాల్సిన పాదయాత్రపై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. వైసీపీ నేతలు ఇప్పటికే… పాదయాత్ర ఆగిపోయినట్లేనని ప్రకటిస్తున్నారు. పాదయాత్ర ఆపేస్తే వారి పంతమే నెగ్గినట్లవుతుంది.