అమరావతిని ఏపీ సర్కార్ కొనసాగించి ఉంటే… లక్షల కోట్ల ప్రజాధనం .. ఆస్తి రూపంలో రెడీగా ఉండేది. కానీ దాన్ని స్మశానంగా అభివర్ణించి అలాగే ట్రీట్ చేసి.. ఇప్పుడు అదే స్మశానంలో స్థలాలను రాజకీయం కోసం… ఆదాయం కోసం ఎకరాల్లెక్క అమ్ముకోవడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ర రాజధానిలో భూముల అమ్మకం కోసం 389, 390 రెండు జీవోలను జారీ చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రకారం స్పెషల్ జోన్లో ఉన్న మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూలో పది ఎకరాల్ల్లో, తుళ్ళూరు మండలం పిచుకలపాలెం రెవెన్యూలో నాలుగు ఎకరాలను అమ్మకానికి పెట్టారు. స్పెషల్ జోన్లో ఉన్న రాజధాని భూములను ఇ-వేలం ద్వారా అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం స్థలాల వేలంపైన మాత్రం దృష్టి పెట్టింది. ఇందుకోసం కోర్ క్యాపిటల్‌లో రెండుచోట్ల 14 ఎకరాలను ఎంపిక చేసింది. నవులూరులో ఎకరా 5.94 కోట్లు, పిచ్చికలపాలెంలో 5.41 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ వేలం ప్రకటన జారీ చేసింది. అమరావతి అభివృద్ధి పనుల కోసమే తాము భూములను ఆక్షన్‌కు పెడుతున్నట్టు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. భూముల ఆక్షన్ ను వచ్చే స్పందనకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. గతంలోనూ వేలం ప్రకటన చేశారు.. కానీ స్పందన లేకపోవడంతో ఆగిపోయారు.
అయితే ఎన్నికలకు ముందు తక్కువ ధరకు అస్మదీయులకు ఈ అమరావతి పొలాలను వేలంలో కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అమరావతిలో ఏ పనీ చేయకుండా… కనీసం రైతులకు కౌలు చెల్లించకుండా… వారు ఇచ్చిన పొలాల్ని ఎలా అమ్ముకుంటారన్న వాదన వినిపిస్తోంది. ప్రతీ విషయంలోనూ కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూముల అమ్మకం.. కేటాయింపులపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.