అమరావతిలో బీజేపీ నేతలకు ఎదురవుతున్న ప్రశ్నలు.. వారి విషయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాలు సహజమైనవే. నిజంగా మూడు రాజధానులు తమ విధానం కాదని.. తాము వ్యతిరేకమని అమరావతికే కట్టుబడి ఉన్నామని బీజేపీ చెప్పాలనుకుంటే.. ఎప్పుడో చేతల్లో చూపించి ఉండేదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. జగన్ మూడు రాజధానులను తెరపైకి తెచ్చి అమరావతిని నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు రాజధాని రాష్ట్రపరిధిలోని అంశమని బీజేపీ తప్పించుకుంది.
అది రాష్ట్ర పరిధిలోనిదేనని కానీ గతలోనే ఆ నిర్ణయం జరిగిందని.. కేంద్రం ఆమోద ముద్ర వేసిందని చెప్పలేదు. జగన్ను ప్రోత్సహించారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తం శిధిలమైపోయే పరిస్థితి. రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. జగన్ ను కంట్రోల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. పట్టించుకోకుండా.. అమరావతిని నిర్వీర్యం చేసి ఇప్పుడు అమరావతికే మద్దతు అంటూ పాదయాత్ర చేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికైనా వారి మద్దతు కొంత మందిని సంతోషపరుస్తున్నా గతానుభవాల దృష్ట్యా వారిని ఎవరూ నమ్మలేకపోతున్నారు .
అందుకే ప్రశ్నలు.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి గతంలో అమరావతికి నిజాయితీగా మద్దతుగా నిలబడిన బీజేపీ నేతలున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా ఉన్నప్పుడు ఆయన మాటలను నమ్మారు. కానీ ఆయనను తొలగించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారడానికి బీజేపీనే కారణమని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఇది బీజేపీ చేసుకున్న స్వయంకృతమే .