మొత్తానికి చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయటపెట్టేశారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం వెనుక ఉన్నదెవరో చెప్పేశారు. విశాఖలో నిర్వహించిన తెలుగు దేశం పార్టీ మహానాడు వేదికపై దీన్ని వెల్లడించారు. అమరావతి చాలా మంచి పేరనీ, వినడానికి కూడా బాగుందనీ చంద్రబాబునాయుడు చెప్పారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరే పెట్టమని ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సూచించారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ నిర్మించాలన్న అంశంపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం, కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య వెలగపూడి కేంద్రంగా 33 వేల ఎకరాల ప్రాంతాన్ని గుర్తించారు. మందడం ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన తెచ్చిన యమున నది నీరు, మట్టినీ, రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన మట్టిని శంకుస్థాపన ప్రాంతంలో నిక్షేపం చేశారు.ఇదే సభలో అమరావతి పేరును ప్రకటించారు.
వాస్తవానికి ఈపేరును నిర్ణయిస్తే ఎవరికీ అభ్యంతరముండదు. కొన్ని గ్రామాలు అదృశ్యమై పోయి, రాజధాని ఏర్పడుతోంది. చారిత్రక ఆనవాళ్ళు కూడా ఎన్నో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అమరారామంగా ప్రసిద్ధిపొందిన అమరావతి రాజధానికి సమీపంలో ఉండడంతో ఆ పేరును ఎంచుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధాన్యకటకం పేరిట గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి రాజధాని ఉండేది. చారిత్రక నేపథ్యమున్న ఈ ప్రాంతంలోని అమరావతిని రాజధాని పేరుకు చంద్రబాబు ఎంచుకున్నారు. దీనికి రాజముద్ర వేయించుకున్నారు. అదే విషయాన్ని ఆయన మహానాడు వేదికపై వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధాని పేరు వెనక సంగతి అదన్నమాట.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి