ఏపీ రాజధాని అమరావతి చుట్టూ 210 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. 20,200కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోతున్న ఈ రింగ్ విషయంలో ప్రజల ఆకాంక్షలను పాలకులు మరచిపోతారా? హైదరాబాద్ రింగ్ విషయంలో అదే జరిగింది. అలాంటి తప్పిదాలు ఏపీలో జరగకూడదనీ, సురక్షితమైన బాహ్యవలయం ఏర్పాటుకావాలని ఏపీ ప్రజలు కోరుకోవడం తప్పా? ఏదో ఆర్భాటంగా మూడేళ్లలో పూర్తిచేసి చేతులుదులుపుకుంటే జరగబోయే అనర్ధాలకు బాధ్యులెవరు ? అందుకే అమరావతి అవుటర్ పై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
1. హైదరాబాద్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అవుటర్ రింగ్ రోడ్డు ప్రయాణీకులకు ఎంతటి ఆనందాన్ని ఇస్తున్నదో అంతగా భయపెడుతోంది. `ప్రయాణీకులకు భద్రతతో కూడిన వేగం’ అందిస్తామని వాగ్దానం చేసిన ఓఆర్ఆర్ ఇప్పుడు తనమాటను వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు అమరావతి రింగ్ అంటున్నారు. మంచిదే, కాకపోతే హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే మెరుగైన భద్రత కల్పించగలమని ఏపీ ప్రభుత్వం గట్టి హామీ ఇస్తుందా?
2. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఇప్పటికీ రింగ్ షేప్ కి (వలయాకృతికి) రాలేదు. ఇంకా గుఱ్ఱపు నాడాలాగానే ఉంది. అవుటర్ పై ఒక చోట బయలుదేరితే 158 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మళ్ళీ అదే చోటుకు రావాలి. కానీ ఆ పరిస్థితి ఇంకా రాలేదు. కొన్ని చోట్ల రైల్వే లైన్ పై ప్లైఓవర్స్ నిర్మించాల్సి రావడంతో లేటైందని అంటున్నారు. ఇది ముందుగా వారికి తెలియదా…? గడువు ప్రజలు పెట్టలేదే… 2013కి పూర్తి చేస్తామని చెప్పిందీ, ఇప్పుడు జాప్యం చేస్తున్నదీ వాళ్లే. మరి అలాంటప్పుడు అమరావతి రింగ్ సకాలంలో పూర్తి అవుతుందని ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తుంది ?
3. హైదరాబాద్ రింగ్ విషయంలో అనేక అవకతవకలు జరిగాయి. ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వలయం (రింగ్) అన్నది పేరుకే పరిమితమైంది. అనేక చోట్ల మెలికలు తిరగాల్సి వచ్చింది. రియలెస్టేట్, బడా వ్యాపారసంస్థలు, రాజకీయ నాయకులు తాము కొన్న భూముల పక్కనుంచే అవుటర్ వెళ్ళాలని పట్టుబట్టడంతో ప్రాధమికంగా నిర్ధారించిన షేప్ దెబ్బతింది. మరి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అమరావతి రింగ్ విషయంలో జరగవని గ్యారంటీ ఇవ్వగలరా?
4. భూసేకరణ, సమీకరణ పూర్తిచేసి అలైన్మెంట్ ఖరారుచేస్తే రింగ్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది సంతోషించాల్సిన విషయమే. అయితే, భూసేకరణ లేదా సమీకరణ విషయంలో ప్రజలకు నష్టం కలగకుండా చూడాలి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేయగలదా ?
5. భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చూడగలరా ? హైదరాబాద్ ఓఆర్ఆర్ విషయంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి. నామమాత్రంగా చెల్లించి, భూమిని స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత తిప్పించుకునే పద్ధతి మానుకోవాలి. మరి అలా స్పందించగలరా ?
6. ఇన్ని వేల కోట్ల ప్రజాధనం ఖర్చుచేస్తున్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వం ఉంటుందా? అమరావతి నిర్మాణంలో ప్రజలే భాగస్వాములని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుంటారు. బాగానే ఉంది. మరి భాగస్వాములైన ప్రజలకు ఖర్చు వివరాలను పారదర్శకంగా చూపించగలరా ?
7. మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు అంటున్నారు. చాలా సంతోషం. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని త్వరత్వరగా నిర్మాణాలు పూర్తిచేస్తే, వాటి నాణ్యత మాటేమిటి ? హైదరాబాద్ ఓఆర్ఆర్ పై అక్కడక్కడా ఎత్తుపల్లాలు రావడంతో వందకిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే వాహనాలు ఎగిరెగిరిపడుతున్నాయి. ఓఆర్ఆర్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వీగిపోతోంది. అమితవేగానికి తగ్గట్టుగా రోడ్ల నిర్మాణంలో కచ్చితమైన ప్రమాణాలు పాటించాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి హామీ ప్రజలకు ఇస్తుందో చెప్పాలి?
8. ఎంత కట్టుదిట్టంగా రింగ్ రోడ్డు వేసినప్పటికీ, రైలింగ్ వంటి నిర్మాణాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల సమీప గ్రామాల నుంచి పశువులు రోడెక్కుతున్నాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ లో ఇలాగే జరుగుతోంది. మరి అమరావతి రింగ్ విషయంలో ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూడగలరా ?
9. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రయాణీకుల భద్రత. వేగాన్ని 100 నుంచి 120 కిలోమీటర్లకు అనుమతించినప్పుడు భద్రతా చర్యలు చాలా కట్టుదిట్టంగా ఉండాలి. ఇలాంటివి లేకపోవడం వల్లనే హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ ఎక్కడమంటే, మృత్యుదారిలోకి మళ్లడమేనన్న భయం ఆవహిస్తోంది. మరి అమరావతి రింగ్ విషయంలో పాలకులు ఎలాంటి భద్రత ఇవ్వబోతున్నారు ? ఓఆర్ఆర్ మీద మధ్యమధ్యలో ప్రాధమిక చికిత్స అందించే కేంద్రాలు, అలాగే మొబైల్ హాస్పటిల్స్ ను ఏర్పాటు చేయగలరా ? హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ జరిగితే, 108 వంటి అంబులెన్స్ రావడానికే గంట పడుతోంది. ఈ పరిస్థితి అమరావతి రింగ్ పై లేకుండా చేయగలరా ?
10. ఓఆర్ఆర్ మీద ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. కానీ తెల్లవారుఝామున సెలబ్రెటీస్ పిల్లలు, ధనవంతుల బిడ్డలు మోటార్ వెహికల్స్ మీద రయ్యిరయ్యిన పోతున్నారు. దీన్ని ఇంతవరకు హైదరాబాద్ లో అరికట్టలేకపోయారు. సెక్యూరిటీ ఎంత వీక్ గా ఉన్నదో చెప్పడానికి ఈ ఉదాహరణచాలు. మరి అమరావతి రింగ్ విషయంలో సెక్యూరిటీ మాటేమిటి ? రాత్రిపూట లైట్లు ఉండవు, సిసి కెమేరాలు లేవు. దారిదోపిడీ దొంగలు రాజ్యమేలుతున్నా పట్టించుకునేవారే లేరు- ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిస్థితి. ఇంతటి భయానకమైన రహదారి తమకెందుకని ఏపీ ప్రజలు అంటున్నారు. సమస్యలన్నింటికీ సమగ్రమైన పరిష్కారమార్గాలను కనుక్కుని, వాటిని అమలుచేస్తూ రింగ్ రోడ్డు వేయాలన్నదే ప్రజల ఆకాంక్ష. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మనోభావాలు తెలుసుకుంటే బాగుంటుంది. ఏకపక్షంగా, తన పార్టీ సొంత నిర్ణయంగా పనులు చేపడితే అది మరో హైదరాబాద్ రింగ్ లా మారిపోతుంది. ఇలాంటి రింగ్ ని ఏపీ ప్రజలు ఎన్నటికీ కోరుకోరు. దయచేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడకండి. ప్లీజ్..
– కణ్వస