అమరావతి అనేది నిరంతర నిర్మాణ కేంద్రం. ఒక్కొక్కటి కట్టుకుంటూ పోవాలి. గతంలో చేసిన తప్పుల్ని ప్రభుత్వం పునరావృతం చేయకుండా జాగ్రత్త పడుతోంది. అప్పట్లోగా కట్టేస్తాం.. ఇప్పట్లోగా కట్టేస్తామని చెప్పడం లేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి నిర్వాకానికి సాక్ష్యాలుగా పెరిగిపోయిన చెట్లను క్లియర్ చేసేందుకు పనులు జరుగుతున్నాయి. జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి.
ఒకటి , రెండు నెలల్లో ఈ ఐదేళ్ల నిర్లక్ష్యాన్ని పూర్తిగా పెకిలించిన తర్వాత రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ముందుగా చాలా వరకూ పూర్తయిన వివిధ వర్గాల నివాస గృహాలను పూర్తి చేయనున్నారు. ఇప్పటిక కాంట్రాక్టర్లతో మాట్లాడారు. పనులు ప్రారంభించడమే మిగిలింది. ఇక ఐకానిక్ కట్టడాలకు పునాదులు పూర్తయ్యాయి. ఆ పునాదులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా నిర్మాణాలు ప్రారంభించనున్నారు.
మొత్తంగా జంగిల్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత తొమ్మిది నెలల్లో ఉద్యోగులు, ఎమ్మెల్యేల నివాస గృహాలన్నీ వినియోగంలోకి రానున్నాయి. అలాగే కేంద్ర సంస్థలకు కేటాయించిన స్థలాల్లో ఆయా సంస్థలకు పొజిషన్లు చూపించనున్నారు. రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించనున్నారు. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో.. అంతకు రెండింతలు ప్రైవేటు పెట్టుబడిదారులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణాలు చేయనున్నాయి. దీంతో మరోసారి ఆర్థిక కేంద్రంగా.. ఇరవై నాలుగు గంటలకూ పని చేసే ప్రాంతంగా అమరావతి మారనుంది.