ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును పాటించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉన్న ఆర్థిక పరిమితులతో కనీసం పాటించినట్లు నటించాలని ప్రయత్నిస్తోంది. హైకోర్టు ఆదేశించినట్లుగా రైతులకు అన్ని సౌకర్యాలతో ప్లాట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఈ అంశంపై గతంలోని కాంట్రాక్టర్లతో సమావేశాలు ప్రారంభించారు. అదే సమయంలో రైతులకు ఫోన్లు చేసి.. ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నారు. రైతులకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తే సరిపోదు.. కల్పిస్తామన్న మౌలిక సదుపాయాలు కల్పించాలి. అందు కోసం గత ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. వారు పనులుకూడా చేస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. తర్వాత అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లనే ప్రభుత్వం పిలుస్తోంది.
ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు పనులుచేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వారికి పెద్దఎత్తున బకాయిలున్నాయి. వాటిని చెల్లించకపోతే వారు చేయరు. అయితే ప్రభుత్వం ఇలా ఉన్న పళంగా అమరావతి పనులు చేయించాలని అనుకోవడంలేదు. ప్రస్తుతానికి అంత ఆర్థిక వెసులుబాటు లేదు. అందుకే హైకోర్టు తీర్పును ధిక్కరించడం లేదని.. పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి కొన్ని సన్నాహాలు చేస్తోంది. హైకోర్టు ఆదేశించిన విధంగా.. మూడు నెలల్లో.. ఆరు నెలల్లో పనులు చేయలేమని చెప్పడానికి ఓ కారణం రెడీ అవుతుందని భావిస్తున్నారు.
రాజకీయంగా మాత్రమే మూడు రాజధానుల ప్రస్తావన అదీ కూడా బొత్స సత్యనారాయణ నోటి వెంటే ఆ మాట వస్తోంది. ఇతరులు అంతా సైలెంటయ్యారు. హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించేందుకు కూడా సిద్ధమైన ప్రభుత్వం ఇప్పుడు వెనుకడుగు వేసింది. బొత్స అనూహ్యంగా హైదరాబాదే రాజధాని అనడంతో మూడు రాజధానుల్ని పక్కన పెట్టేసినట్లేనన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం మరింత క్లారిటీకి రావాల్సి ఉంది. అమరావతిని అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు.. ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి క్లారిటీ ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధంగా లేదు.