అమరావతి ఉద్యమ దీక్షలపైనే అధికార పార్టీ నేతల దృష్టి పడింది. కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేసినప్పటి నుండి వైసీపీ నేతలు.. మంత్రులు.. అంత మంది గుమికూడి అమరావతి ఉద్యమం చేస్తున్నప్పుడు.. కరోనా రాదా.. వాటిని ఎందుకు ఆపలేదని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారులు కూడా అదే చెబుతున్నారు. అమరావతిలో ఉద్యమాన్ని విరమించుకోవాలి, గుంపులుగా ఉద్యమం చేయడం వలన కరోనా వ్యాపించే అవకాశం ఉందని గుంటూరు కలెక్టర్ ఆనంద్ శామ్యూల్ పిలుపునిచ్చారు. అంతకు ముందు మంత్రి పేర్ని నానితో పాటు.. పలువురు నేతలు ఇదే మాట మాట్లాడారు. ఇప్పుడు అధికారులు కూడా అదే చెబుతున్నారు.
కరోనా పేరుతో..అమరావతి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో ఓ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఖరారయిందన్న అనుమానం.. అమరావతి జేఏసీ ఉద్యమకారులకు కూడా వచ్చింది. ఇప్పటికే.. ఉద్యమ శిబిరాల నిర్వహణపై.. అమరావతి జేఏసీ నేతలకు హెచ్చరికలు వచ్చాయి. ఉద్యమ శిబిరాల నిర్వహణపై జేఏసీకి ప్రభుత్వ నోటీసులు ఇస్తామని చెప్పిందని ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరిస్తామని జేఏసీ నేతలు అంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉద్యమం ముందుకు సాగేలా జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించి.. నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు.
కారణం ఏదైనా.. మొదటి నుంచి.. అమరావతి ఉద్యమంపై.. వైసీపీ నేతల కన్ను ఉంది. మూడు నెలలు దాటిపోయినా.. అమరావతి ఉద్యమంలో మార్పులు రాకపోవడం.. రైతులు వెనక్కి తగ్గకపోవడంతో.. ఎలా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు కరోనా పుణ్యమా అని.. అమరావతి రైతుల ఉద్యమాన్ని కట్టడి చేసే అవకాశం లభించినట్లుగా కనిపిస్తోంది.