మరి కొన్నాళ్లపాటూ ప్రారంభోత్సవాలకు సంబంధించిన సుమూహూర్తాలు లేవనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కొత్త రాజధానిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలకు లాంఛనంగా ప్రారంభోత్సవాన్ని కూడా పూర్తిచేశారు. కొత్త రాజధాని అమరావతిలోని వెలగపూడిలో ప్రస్తుతం తాత్కాలిక సచివాలయ భవనాలను నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ నిర్మాణాలు శ్లాబు దశ వరకు వచ్చాయి. జూన్ నాటికి ఇక్కడ సచివాలయం పనిని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే భవనాలను సత్వరం పూర్తిచేయాలని వేగంగా సాగిస్తున్నారు. అయితే.. ఆ సమయానికి భవనాల ప్రారంభోత్సవాలకు సరైన ముహూర్తాలు లేవనే ఉద్దేశంతో ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న చోట రెండు గదులు పూర్తిచేసి లాంఛనంగా వాటిని ప్రారంభించారు. ప్రభుత్వ పరిపాలన పనిని కూడా చంద్రబాబు అక్కడినుంచి లాంఛనంగా ప్రారంభించారు.
వెలగపూడిలో మొత్తం ఆరు బ్లాకులుగా తాత్కాలిక భవనాల నిర్మాణం సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నాలుగు బ్లాకులు సచివాలయ భవనాలు కాగా, ఒకటి సీఎం కార్యాలయ భవనాలు, 6వ బ్లాకు అసెంబ్లీ ఉండేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే ప్రారంభోత్సవానికి సోమవారం ఉదయం 4.01 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి వీలుగా రెండు గదులను సకల హంగులతో సిద్ధం చేశారు.
అదే ముహూర్తానికి చంద్రబాబు భవనాల్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం రూ.3250 కోట్ల రూపాయలను రుణమాఫీకి మలి విడతగా విడుదల చేస్తున్న ఫైలుపై చంద్రబాబునాయుడు సంతకం చేశారు. రాజధాని నిర్మాణం సజావుగా సాగడానికి భూములిచ్చి సహకరించిన రైతులందరికీ కూడా చంద్రబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజధానికి భూములిచ్చిన అన్ని గ్రామాల రైతులకు తాను పాదాభివందనం చేస్తున్నట్లుగా చంద్రబాబు పేర్కొనడం విశేషం.