తుళ్లూరు ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతు కుటుంబాలకు చెందిన మహిళల వద్దకు వెళ్లిన టీవీ9 యాంకర్ దీప్తి.. పెయిడ్ ఆర్టిస్టుల ఆందోళన అంటూ.. రిపోర్టింగ్ చేశారు. ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. టీవీ9 సీఈవో రజనీకాంత్.. అమరావతిలో సచివాలయం ఉంటే.. ఏంటి.. ఉండకపోతే ఏంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆందోళనలో పాల్గొన్న మహిళలు… టీవీ9 రిపోర్టర్ దీప్తిని చితకబాదారు. జగన్ మీడియా ప్రతినిధులపైనా విరుచుకుపడ్డారు. మహిళల దాడిలో.. ఇద్దరు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. వారి వాహనాలను మహిళలు స్వల్పంగా ధ్వంసం చేశారు. మహిళలు.. మహిళా రిపోర్టర్‌పై దాడి చేస్తున్నా.. పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదు.
ఆందోళన చేస్తున్న వారిని మరింత రెచ్చగొట్టడం.. టీవీ9 మీడియా స్ట్రాటజీల్లో ఓ భాగం. టీవీ9 అంటే.. ఓ బ్రాండ్. ఎవరిదైనా ఇల్లు తగలబడిపోతూంటే… చలి కాచుకోవడానికి .. మంటల్ని మరింత ఎగదోయడానికి ఏ మాత్రం సంకోచించని మీడియా మైండ్‌సెట్. రవిప్రకాష్ ఉన్నప్పుడే కాదు.. ఆయన లేకపోయినా.. తీరు మారలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తన వంతు ప్రయత్నం చేసిందో.. ఎన్నికల సమయంలో.. కులం అడ్డుగోడలు కూల్చేద్దాం అంటూ.. కులాల మధ్య చిచ్చుపెట్టే చర్చాకార్యక్రమాలు నిర్వహించి.. విమర్శలు ఎదుర్కొంది ఆ చానల్. ఇప్పుడు.. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తూ… ఆగ్రహానికి గురయింది.
బాధితులపై ఏ మీడియా అయినా సానుభూతి చూపిస్తుంది. వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయిన.. టీవీ9 మాత్రం పాలకుల మెప్పు కోసం ప్రయత్నిస్తోంది. రివర్స్ టెండరింగ్‌లలో మేఘా సంస్థ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను పొందింది. దానికి ప్రతిఫలంగా.. మేఘా యాజమాన్యానికే చెందిన టీవీ9 వ్యవహరిస్తోంది. యాజమాన్యాన్ని కాదనలేని స్థితిలో జర్నలిస్టులు.. రిపోర్టింగ్ చేస్తున్నారు. ప్రజాగ్రహానికి గురవుతున్నారు.