హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న ప్రధాన భవనం(స్మార్ట్ గవర్నమెంట్ కాంప్లెక్స్)ను 2018 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. అయితే ఆ భవన సముదాయం డిజైన్‌గానీ, కాంట్రాక్టర్గానీ ఇప్పటికీ ఖరారు కాలేదు. మరి ఈ 42 అంతస్తుల భవన సముదాయం ఎప్పటికి పూర్తవుతుందనేది అధికారులకుకూడా అంతుపట్టటంలేదు. కనీసం 2019 ఎన్నికలలోపైనా వస్తే చంద్రబాబునాయుడు ఆ భవనాన్ని చూపించైనా ఓట్లు అడగొచ్చుకదా!
ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాపిటల్ సిటీ డెవలెప్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(సీసీడీఎమ్సీ) స్మార్ట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంపై టెండర్లు పిలిచింది. పది టెండర్లు దాఖలైనప్పటికీ మంచి సంస్థలేవీ టెండర్లు వేయకపోవటంతో ఆ కార్యక్రమం ముందుకు సాగలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసేందుకు, భవన సముదాయం డిజైన్‌ను, కాంట్రాక్టర్‌ను ఖరారు చేసేందుకు ఆర్కిటెక్ట్‌లతో ఒక కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ కమిటీలో సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్లతోబాటు, అర్కిటెక్ట్ కంపెనీలుకూడా ఉంటాయి. ఇప్పటికీ కొందరు అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్‌లను ప్రభుత్వ వర్గాలు సంప్రదించాయి. భారత నిపుణులతోబాటు, సింగపూర్, జపాన్, చైనా, అమెరికా ఆర్టిటెక్ట్లుకూడా ఈ కమిటీలో ఉంటారని సమాచారం. ఈ కమిటీ స్మార్ట్ గవర్నమెంట్ కాంప్లెక్స్‌ను డిజైన్ చేయటంతోబాటు నిర్మాణానికి మంచి సంస్థలనుకూడా ఎంపిక చేస్తుంది.
స్మార్ట్ గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో రాజ్‌భవన్, సెక్రటేరియట్, హైకోర్ట్, గెస్ట్ హౌస్‌లు, ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 1.32 కోట్ల చదరపు అడుగుల స్థలం ఉంటుంది. ఈ భవన నిర్మాణ పనుల బాధ్యతను సీసీడీఎమ్సీ నుంచి సీఆర్డీఏ తన చేతుల్లోకి తీసుకుంది.