అమరావతి తరలింపు అంశంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాలు తీసుకు రావడం అవి మండలిలలో ఆగిపోవడం .. అయినప్పటికీ ప్రభుత్వం నిబంధనల పేరుతో రెండో సారి అవే బిల్లులు పెట్టి ఆమోదించుకోవడం వంటి పరిణామాల నేపధ్యంలో ఆ బిల్లులు చెల్లవని రైతులు పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయించారు. వివిధ అంశాలపై దాదాపుగా వంద పిటిషన్లు విచారణలో ఉన్నాయి. గతంలో మే 3 నుంచి రాజధాని కేసులపై ఆన్లైన్లో కాకుండా నేరుగానే విచారణ జరపాలని అనుకున్నారు. కానీ కరోనా ఉద్ధృతంగా ఉండటంతో ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేశారు.
ఈ రోజు నుంచి కేసులను రెగ్యూలర్గా విచారణ జరుపుతారా… లేక రోజువారీ విచారణకు మరో తేదీ ఖరారు చేస్తారా అన్నది విచారణలో తేలనుంది. గతంలో రాజధాని కేసులన్నీ చీఫ్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరిగేవి. పిటిషనర్ల తరపు వాదనలు దాదాపుగా ముగిశాయి. ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. అయితే చీఫ్ జస్టిస్ బదిలీతో అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు కొత్తగా విచారణ ప్రారంభించనున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం, ఈ పిటిషన్లలో భాగస్వాములుగా ఉన్న వారంతా తిరిగి అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
మళ్లీ మొదటి నుంచి ప్రారంభిచాల్సి రావడం వల్ల విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో అమరావతి భూములకు సంబంధించి అనేక కీలక తీర్పులు వచ్చాయి. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇటీవల మూడు రాజధానుల ప్రస్తావనను తగ్గించింది.