పులివెందులలో ఇతర పార్టీల వారు ఎవరైనా ప్రచారానికి వారిపై… చాటు నుండి రాళ్లు, చెప్పులు విసురుతారు కొంత మంది. అదే చీకట్లో అయితే.. గుడ్లు కూడా వేస్తారు. ఇప్పుడా.. ఆ సంస్కృతి అమరావతికి వచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్తూండగా.. కొంత మంది వైసీపీ కార్యకర్తలు.. కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరేశారు. ఓ వ్యక్తి విసిరిన రాయి దెబ్బకు చంద్రబాబుతో పాటు.. ఇతర పార్టీ నేతలు ఉన్న బస్సు అద్దం.. కూడా పగిలింది. రెండు, మూడు రోజుల నుంచి… వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. అయినప్పటికీ.. పోలీసులు అలాంటి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయకపోగా.. ఉదయం నుంచి.. సీడ్ యాక్సెస్ రోడ్డు చుట్టూ.. వారంతా మోహరించి ఉన్నప్పటికీ.. వారిని తరమేయలేదు. రోడ్ దాటి ముందుకు రాకుండా.. రోప్ పార్టీ అడ్డంగా ఉంది. ఆ రోప్ దాటి.. ముందుకు రాకుండా.. రాళ్లు, చెప్పులు వేసుకోమన్నట్లుగా పోలీసులు వారికి అభయం ఇచ్చేశారు. దాంతో.. వారు చెలరేగిపోయారు.
చంద్రబాబు.. మొదటగా.. తన ఇంటి నుంచి బయలుదేరి.. నడుచుకుంటూ… ప్రజావేదిక వద్దకు వచ్చారు. జగన్ సీఎం అవగానే ఆ ప్రజావేదికను కూల్చేశారు. కానీ శిధిలాలు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాయి. వాటిని పరిశీలించారు. ఆ తర్వాత శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన మట్టితో ఉన్న ప్రాంతానికి ప్రణమిల్లి నమస్కారం చేశారు. మంత్రులు రాజధానిని శ్మశానంతో పోల్చడం చాలా బాధాకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిని నిర్లక్ష్యం చేసి.. భావితరాల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేద్దామనుకుంటే.. వైసీపీ నేతలు అడ్డుపడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు.. ఆగిపోయిన నిర్మాణాలన్నింటినీ పరిశీలిస్తారు. చంద్రబాబు వెంట పెద్ద ఎత్తున రాజధాని రైతులు కూడా.. పర్యటనలో పాల్గొన్నారు. గ్రామాల వారీగా భూములిచ్చిన రైతులతో.. చంద్రబాబు మాట్లాడుతున్నారు. రాజధానిలో చంద్రబాబు పర్యటనపై.. మొదటి నుంచి.. వైసీపీ సర్కార్.. వ్యతిరేక భావనతోనే ఉంది. ప్రకటనలే కాదు.. చివరికి.. చెప్పులు, రాళ్లు వేయడం వరకూ పరిస్థితి రావడంపై.. రాజధాని గ్రామాల వాసులూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని మండి పడుతున్నారు.