అమరావతికి మహర్దశ రానుంది. కేంద్రం రూ. పదినేను వేలకోట్లను ప్రపంచ బ్యాంక్ ద్వారా అందిస్తోంది. అంతా రెడీ అయిపోయింది. వరల్డ్ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ నాటికి కేంద్రం అడ్వాన్సులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో పనులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నివేదికలు.. జంగిల్ క్లియరెన్స్ వంటివి జోరుగా సాగుతున్నాయి. గతంలో పనులు మధ్యలో ఆగిపోయాయి వాటి సామర్థ్యాన్ని పరీక్షించి కట్టడాలను కొనసాగించడానికి అవసరమైన చర్యలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చారు.
ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం ప్రారంభించవచ్చు. కానీ నిధుల సమస్య ఉంది. అందుకే కేంద్రం ఇచ్చే నిధుల తోనే అమరావతిని నిర్మించాలని నిర్ణయించారు. ఐదేళ్ల పాటు పాడు పెట్టినందున మొత్తం మళ్లీ నిర్మాణానికి అనుకూలంగా తీసుకురావాలంటే సమయం పడుతుంది. దాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నారు. గతంలో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లతో గడువు ముగిసిపోయింది. బిల్లులు రావాల్సిన వాళ్లు కూడా ఉన్నారు. వారందరికీ సెటిల్ చేసి కొత్త టెండర్లను పిలవనున్నారు.
అక్టోబర్ , నవంబర్ లో టెండర్ల ప్రక్రియ, ఇతర పనులు పూర్తి చేసి పనులు డిసెంబర్ మొదటి వారంలోనే ప్రారంభమయ్యేలా చూడనున్నారు. బడా నిర్మాణ సంస్థల్ని రంగంలోకి దింపి.. అన్ని పనుల్ని ఏకకాలంలో జరిగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాంతరంగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రైవేటు సంస్థల పెట్టుబడులు వచ్చేలా చూడనున్నారు. దీంతో 2019లో టీడీపీ ఓడిపోయే ముందు అక్కడ ఇరవై నాలుగు గంటలూ జరుగుతున్న పనుల్లాగా.. వచ్చే డిసెంబర్ తర్వాత అమరావతి వెలిగిపోయే అవకాశం ఉంది.