హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రు.27,097 కోట్లు వ్యయమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్దీభాయ్ చౌదరి చెప్పారు. ఇవాళ లోక్సభలో ఈ విషయంపై మాట్లాడుతూ, అమరావతి నిర్మాణంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ మేరకు అంచనా వేసిందని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, క్యాపిటల్ జోన్లో భవనాల నిర్మాణం కోసం రు.10,519 కోట్లు, మౌలిక వసతులను అభివృద్ధి చేయటానికి రు.1,536 కోట్లు, నగరంలోని మౌలిక వసతుల అభివృద్ధికోసం రు.5,861 కోట్లు, నగరంలోని మౌలిక వసతుల విస్తరణకు రు.9,181 కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. మొత్తం మీద రు.27,097 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఇప్పటివరకు కేంద్రం రు.1,850 కోట్లు అందించిందని తెలిపారు.
ఈ అంచనాను రూపొందించినది రాష్ట్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీయేనని కేంద్ర మంత్రి అంటున్నారు… బాగానే ఉంది. మరి సింగపూర్ ప్రభుత్వం అందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మించటానికి లక్షన్నర-రెండు లక్షల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. వాస్తవానికి రాజధాని నిర్మాణానికి రు.4 లక్షల కోట్లు అవసరమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట్లో అన్నారు. కానీ కేంద్రం రూ.27,097 కోట్లు మాత్రమే ఇవ్వబోతోందని ప్రకటించినట్లు భావించవలసి ఉంటుంది.బహుశః అందుకే స్విస్ చాలంజ్ పద్దతిలో రాజధాని నిర్మాణం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు. ఈ పద్దతిలో రాజధానిని నిర్మించే సంస్థలే పెట్టుబడి పెట్టి అందుకు బదులుగా రాజధానిలో భూమిని, భవనాలను దీర్ఘకాలిక లీజు మీద తీసుకొంటాయి.