అమరావతి విస్తరణపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు లీక్ చేశాయి. మరో నలభై వేల ఎకరాలు భూసమీకరణ లేదా, సేకరణ చేయాలని అనుకుంటున్నారు. కొంత మంది రైతుల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేశారు. మొత్తం పదకొండు గ్రామాల పరిధిలో ఈ భూసేకరణ లేదా సమీకరణ ఉండే చాన్స్ ఉంది. రైతులు ఇస్తారా లేదా అన్న విషయాలు పక్కన పెడితే అసలు అంత తొందర ఎందుకన్న ప్రశ్న ప్రధానంగా వస్తోంది. అమరావతి ఇంకా రీ స్టార్ట్ కాలేదు. అభివృద్ధి చూపించిన తర్వాత కదా అసలు ప్రణాళికలు వేయాల్సింది..వాటిని ప్రజల ముందు పెట్టాల్సింది.
అమరావతి ఇప్పటికీ నెరవేరని స్వప్నమే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఒక్క రాజధాని అనే బోర్డు సరిపోదని దాన్ని విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా మార్చాలని చంద్రబాబు ఆలోచించి అమరావతిని ఖరారు చేశారు. ఆయన సంకల్పానికి రైతులు తోడుగా నిలిచారు. ఎక్కడైనా పది ఎకరాలు సేకరించడానికి తంటాలు పడే పరిస్థితుల్లో వేల ఎకరాలు సమీకరించారు. అంతా అద్భుతమే. కానీ ఆయన ఓడిపోవడంతో జగన్ రావడంతో అది శ్మశానం అయిపోయిందని వైసీపీ నేతలే తేల్చారు. రెండో సారి అధికారంలోకి చంద్రబాబు వచ్చే వరకూ అంతే. ఇప్పుడు మళ్లీ అమరావతికి రెక్కలు వస్తున్నాయి. నిధులు వస్తున్నాయి. నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. పది నెలలు అయినా పనులు ప్రారంభం కాకపోవడంతో సహజంగానే స్టేక్ హోల్డర్లలో అసంతృప్తి కనిపిస్తోంది.
ముందు అమరావతిలో ప్లాన్ చేసిన పనులు శరవేగంగా సాగితే నమ్మకం !
అమరావతి తొలి దశను అద్భుతంగా ప్లాన్ చేశారు. కానీ వాటి అమలు సంగతేమిటన్నది ఇప్పుడు ప్రశ్న. మొదటి సారి అమరావతికి పునాదులు పడ్డాయి. రెండో సారి గెలిచిన వెంటనే ఆ పునాదుల మీద నుంచి నిర్మించేస్తారని రెండేళ్లలో తొలి దశ అమరావతిని చూడొచ్చని అనుకున్నారు. పది నెలల అయింది. ఇప్పటికి రీటెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించారు. రుణాలు, నిధుల సమీకరణలో ముందడుగు వేశారు. కానీ ప్రజలు ఇవన్నీ చూడరు. పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూస్తారు. ఆ ప్రకారం చూస్తే ఇప్పటి వరకూ రీస్టార్ట్ కాలేదు. పనులు సాగుతూ ఉంటేనే ప్రజలకు నమ్మకం వస్తుంది.
ఏడాదిన్నర తర్వాత అభివృద్ధి చూపించి అప్పుడు భూసేకరణ లేదా సమీకరణ ప్లాన్ చేస్తే బెటర్
పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిన్నరలో కోర్ క్యాపిటల్ ను పూర్తి చేయడమే కాదు.. ఇప్పటికే భూములు కేటాయించిన సంస్థలన్నీ తమ తమ కార్యాలాయలను నిర్మించుకుని కార్యాలయాలను ప్రారంభించుకునేలా చేయాల్సి ఉంది. అప్పుడే ప్రభుత్వం చెప్పింది చేయగలుగుతుందన్న భావన వస్తుంది. అలాంటి సమయంలోనే భూసమీకరణ లేదా సేకరణ చేయడం మంచిది. ఎందుకంటే.. ఈ సారి రైతులు.. గతంలోలా ఇబ్బంది పడకూడదు. లాఠీ దెబ్బలు తినకూడదు. వారి త్యాగాలకు గుర్తింపు రావాలి.