కొన్నాళ్ల క్రితం జగన్ మూడురాజధానుల నిర్ణయం ప్రకటించినప్పుడు దాన్ని సమర్థిస్తూ అమరావతి మీద టీవీ9 చేసిన విష ప్రచారాన్ని ఎవరైనా మర్చిపోగలరా?. కవరేజీకి వెళ్లిన ఆ చానల్ రిపోర్టర్ని రైతులు కొట్టినంత పని చేశారు. ఇప్పుడు అదే టీవీ 9 చానల్లో అహో అమరావతి.. ఓహో అమరావతి అనే భజన ప్రోగ్రామ్స్ తరచూ వస్తున్నాయి. తాజాగా గురువారం ప్రైమ్ టైమ్ లో వేసిన ఓ షో చూసి నిజమా.. టీవీ9కి అమరావతి అంత అభివృద్ధి కనిపించిందా అని అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
అయితే అతి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా టీవీ9 తీరు ఉంది.భవిష్యత్ లో జరిగే అభివృద్ధిని తాము ఇప్పుడే చూపిస్తామన్నట్లుగా హడావుడి చేస్తోంది. ప్రభుత్వాన్ని ఎంత కాకా పట్టాలనుకుంటే అంతగా అతి ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. లేకపోతే అమరావతిలో అంతా పోసేసి అభివృద్ధి చేసేస్తున్నారన్న ప్రచారాన్ని చేసి ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత పెంచాలని చేస్తున్న అతిలా ఉందని మరికొంత మందికి అనిపిస్తోంది.
టీవీ9 టీడీపీ ప్రభుత్వం విషయంలో ఎప్పుడూ జీనియన్ గా లేదు. అవసరం కోసం సపోర్టు చేయడమే. ఎన్నికల ఫలితాల రోజు వరకూ ఆ చానల్ లో ఏమి వచ్చిందో.. లోకేష్ ను.. చంద్రబాబును..టీడీపీని, పవన్ ను.. కూటమిని ఎలా డీగ్రేడ్ చేశారో అందరూ చూశారు. వైసీపీకి ఎలా ప్రచారం చేశారో.. వైసీపీ కోసం ఇతర పార్టీలపై ఎలా బురద చల్లారో అంత సామాన్యంగా ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు ఏదో ప్రయోజనం కోసం లేనిపోని అభివృద్ధిని ముందే ప్రచారం చేస్తే ఏదో మేలు చేస్తారనో.. లేకపోతే కోపం తగ్గించుకుంటారనో అనుకోవడం సాధ్యం కాకపోవచ్చునన్న వాదన వినిపిస్తోంది.