అమరావతి ఎవరిది..?…
అమరావతి అనే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత.. ఈ ప్రశ్న చాలా వేగంగా కులం, మతం, ప్రాంతం ఆధారంగా ప్రజల్లోకి చొప్పించింది రాజకీయం. అమరావతి కొంత మందిదే అన్న ప్రచారాన్ని.. వైసీపీ నేతలు.. ప్రజల్లోకి చర్చ పెట్టారు. సోషల్ మీడియాలో గ్రూపుల ద్వారా.. ఈ భావాన్ని విస్తృత పరిచారు. ఐదేళ్ల పాటు .. ఈ ప్రచారం జరిగింది. ఎంతగా జరిగింది అంటే.. అమరావతి .. ఏపీ రాజధాని కాదు.. అమరావతి అభివృద్ది చెందితే.. బాగుపడేది కూడా.. ఒక్క సామాజికవర్గం వారే లేకపోతే..రెండు జిల్లాల వారేనని నమ్మేలా చేశారు. అందుకే.. రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నా… ఇతర ప్రాంతాల్లోని వారు పెద్దగా సానుభూతి చూపడం లేదు.
భూములిచ్చినవారిలో 90 శాతం పేద రైతులే..!
రాజధానికి భూములిచ్చిన వారంతా టీడీపీ వాళ్లేనని.. వారంతా ఒకే సామాజికవర్గం వారని ప్రచారం చేశారు. అందరూ.. డబ్బులో పుట్టి.. డబ్బులో పెరిగినవారేనని కూడా చెప్పుకున్నారు. చాలా మంది.. అదే నిజమని ఇప్పటికీ నమ్ముతున్నారు. నిజానికి రాష్ట్రంలో.. రాయలసీమలో … ఉత్తరాంధ్రలో.. ఇతర కోస్తా జిల్లాల్లో ఉండే వ్యవసాయ పరిస్థితులే అక్కడా ఉంటాయి. కాకపోతే.. కృష్ణానది ఒడ్డున ఉండే గ్రామాలు కాబట్టి.. ఓ పంట ఎక్కువ పండుతుంది. అక్కడ వందల ఎకరాలు ఉన్న భూస్వాములు ఎవరూ లేరు. కనీసం పాతిక ఎకరాలు ఉండే.. ధనవంతులు ఒక్క శాతం కూడా ఉండరు. ఒకటి నుండి.. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులే తొంభై శాతం మంది ఉన్నారు. రాజధానికి భూములిచ్చిన వారి లెక్క చూస్తే.. అదే తేలిపోతుంది.
సగటున ఒక్కో రైతు ఇచ్చిన భూమి ఎకరం మాత్రమే..!
ప్రభుత్వానికి 33, 771 ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇచ్చారు. ఇలా ఇచ్చిన రైతుల సంఖ్య 29754. అంటే.. దాదాపుగా ఒక్కొక్క రైతు.. ఒక్కొక్క ఎకరానికి కొద్దిగా ఎక్కువ మాత్రమే సగటున ప్రభుత్వానికి ఇచ్చారు. 29 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంకా డీటైల్డ్ గా చూసుకుంటే.. ఒకటి నుంచి రెండున్నర లోపు ఎకరాలను అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు 6,278 మంది, రెండున్నర నుంచి ఐదు ఎకరాల్లోపు ఇచ్చిన వారు 2,131 మంది, ఐదు నుంచి పది ఎకరాలలోపు ఇచ్చిన వారు 765 మంది. పది నుంచి ఆపై ఎకరాలు ఇచ్చిన వారు వందల్లో కూడా లేరు. 69 శాతం మంది రైతులు ఎకరంలోపు ఇచ్చారు. వీరంతా..నిరుపేద రైతులు. భూములు ఇచ్చినవారిలో 90 శాతం మంది రెండున్నర ఎకరాలలోపు ఉన్నవారే. వీరిని మధ్యతరగతి కేటగిరి కింద వేయవచ్చు. కేవలం 3.3 శాతం మంది మాత్రమే.. ఎగువ మధ్యతరగతి, ధనికవర్గాలు. సామాజికపరంగా చూసుకుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 75 శాతం ఉన్నారు. మిగిలిన పాతిక శాతంలో కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, కాపు వంటి అగ్రకులాలకు చెందినవారున్నారు.
అమరావతిని కొంత మందికే పరిమితం చేసిన పాపం ఎవరిది..?
అమరావతి విషయంలో అప్పటి ప్రభుత్వం చేసిన హడావుడి కావొచ్చు.. అప్పటి ప్రతిపక్షం.. ఇప్పటి అధికారపక్షం చేసిన ప్రచారం కావొచ్చు.. కారణం ఏదైనా… అమరావతి అంటే.. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి .. ప్రజలందరికీ చెందిన రాజధాని అనే భావనను ప్రజల్లోకి చొప్పించలేకపోయారు. ఆ విషయంలో .. రాజధానికి భూములిచ్చిన రైతులు.. గత రెండు వారాలుగా… రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా.. ఇతర ప్రాంతాల ప్రజలు సానుభూతి చూపుతున్నారు కానీ… రోడ్డెక్కే ప్రయత్నం చేయడం లేదు. అమరావతిని భూములిచ్చిన 29 గ్రామాల రైతుల సమస్య గా భావించి పాపం.. అంటున్నారు కానీ.. అమరావతి మా సొంతం.. మా రాజధాని అని.. ఉద్యమించే ప్రయత్నం చేయడం లేదు. రాజధాని రైతులకు న్యాయం పేరుతో ప్రకటనలు చేస్తున్నారు కానీ… అన్యాయమైపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం తాము పోరాడుతున్నామని బలంగా చెప్పలేకపోయారు.
రైతుల్ని “బ్రోకర్లు”గా విమర్శించి సాధించేదేమిటి..?
కళ్ల ముందు కనిపించే నిజాల్ని కూడా సోషల్ మీడియా ద్వారా అబద్దాలుగా ప్రచారం చేసి.. కొంత మంది కళ్లు కప్పేయగల చాతుర్యం ఇప్పటి రాజకీయ పార్టీలకు ఉంది. ఆందోళన చేస్తున్నది రైతులు కాదని.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లని మంత్రులే విమర్శించడం… అధికార క్రూరత్వానికి పరాకాష్టలాంటిదే. ప్రభుత్వం రాజధాని రైతులపై ఎలాంటి సానుభూతి చూపిండం లేదు. వారందర్నీ దారుణంగా ట్రీట్ చేస్తోంది. రాజకీయంగా అమరావతిని బలిపశువును చేసి.. తాము లబ్ది పొందాలనుకుంటోంది. కానీ ఈ క్షుద్ర రాజకీయంలో బలైపోతోంది… చిన్నకారు రైతులే. రైతులు కన్నీరు పెట్టిన ఏ నేలా.. కన్నీరు పెట్టించిన ఏ నేతా బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవన్నది నిజం.