ఏ రైతుల సహనం నశిస్తోంది? ఏ రాష్ట్రంలో? వీరంతా వ్యవసాయం చేసే రైతులా? కాదండి…వీరు వ్యవసాయం వదలుకున్న రైతులు. వీరంతా ఏపీలోని రాజధాని అమరావతి ప్రాంత రైతులు. సబ్జెక్టు అర్థమైంది కదా. వీరు చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు. అద్భుతమైన రాజధాని నగరం సాకారం కాబోతోందని కలలుగన్న రైతులు. ‘నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అన్నట్లుగా రాజధాని నిర్మాణంలో తామూ భాగస్వాములమయ్యామని, తమ వంతు పాత్ర పోషించామని ఆనందించిన రైతులు. ఆనాటి ప్రభుత్వం ఆపర్ చేసిన ప్యాకేజీలకు ఆశపడి భూములను ఇచ్చేసిన రైతులు. కాని ఇప్పటివరకు వీరి ఆశలు సాకారం కాలేదు. వారి భూములు ఉపయోగించుకోలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి ఊసు లేకుండాపోయింది. దీంతో రైతులు అయోమయంలో పడిపోయారు. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారిలో సహనం నశిస్తోంది.
అద్భుతమైన అమరావతి నిర్మిస్తానని, ప్రపంచంలోని ఐదు మేటి రాజధానుల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఊరించిన చంద్రబాబును ఎన్నికల్లో ఓడించారు. రాజధాని ప్రాంతంలో సైతం వైకాపాను గెలిపించారు. కాని వైకాపా సర్కారు రాజధాని నిర్మాణం విషయంలో అడుగు ముందుకు వేయడంలేదు. రాజధాని నిర్మాణం అంత ప్రధానమైంది కాదని చెబుతోంది. పైగా నగర నిర్మాణానికి డబ్బులు కూడా లేవంటోంది. మంత్రులు ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు తప్ప సీఎం జగన్ స్పష్టత ఇవ్వడంలేదు. ఇందుకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. సాధారణ రోజుల్లో నిరహారదీక్షలు, నిరసనలు చేస్తే ప్రయోజనం ఏముంటుంది? ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు.
అందుకే ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి పోవాలంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే లేదా నిలదీయాలంటే, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటే అందుకు తగిన సమయం అసెంబ్లీ సమావేశాలేనని అనుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు డిసెంబరు 9 నుంచి ప్రారంభం కోబోతున్నాయి. ఆ సమయంలో నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. రైతుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఇది ప్రతిపక్షాలకు ప్రధానంగా టీడీపీకి తగిన సమయం, వేదిక కూడా. మీడియాలోనూ ఎక్కువ ఫోకస్ అవుతుంది. రైతులు నిరాహార దీక్షకు కూర్చుంటే అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్‌హాట్‌గా జరగడం ఖాయం. సీఎం జగన్ తన మనసులో ఏముందో బయటపెట్టక తప్పదు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజధాని ప్రాంతంలో అన్ని నిర్మాణాలు ఆగిపోయాయయని, అసలు రాజధాని ఇక్కడ ఉంటుందో, ఉండదోననే సందేహం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నవరత్నాల మంత్రం’ జపిస్తున్న ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని విస్మరించిందని చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో 30 వేల ఎకరాలకు పైగా భూమిని రైతులు ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే కదా. భూములు అప్పగించిన రైతులకు అన్ని విధాల అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ఆనాడు బాబు వాగ్దానం చేశాడు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కొత్త సర్కారు ఆరోపణ.
అసలు రాజధాని ఇక్కడ ఉండాలా? వద్దా? అనేది నిర్ణయించడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. అమరావతి భవిష్యత్తును నిర్ణయించేంది ఇదే. జగన్ అధికారంలోకి రాగానే మంత్రి బొత్స సత్యనారాయణ ముందుగా మాట్లాడింది అమరావతి గురించే. ఇది సురక్షిత ప్రాంతం కాదని, వరదలు ముంచెత్తే ప్రాంతమని అన్నాడు. దీనికి తగ్గట్టుగానే మొన్నీమధ్య ఇండియా మ్యాప్‌లో అమరావతి మిస్సయింది. సరే…కేంద్ర ప్రభుత్వం మళ్లీ చేర్చిందనుకోండి. రైతుల నిరాహార దీక్ష ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.