మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగింది. చినకాకాని వద్ద హైవే దిగ్భంధనం కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులు… ఆ రూట్లో వస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి కారును అడ్డుకున్నారు. ఆయన కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలో పిన్నెల్లి గన్మెన్లు.. కారును చుట్టుముట్టి నినాదాలు చేస్తున్న వారిలో ఒకరిని కొట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. మిగిలిన వారు.. పిన్నెల్లి కారుపై రాళ్ల దాడి చేశారు. ఓ కారు అడ్డంగా ఉండటంతో.. దాన్ని ఢీకొట్టేసి.. పిన్నెల్లి కారును.. డ్రైవర్ శరవేగంగా పక్కకు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు.. ఎమ్మెల్యే కారుని రైతులు ముట్టడించినప్పుడు.. పోలీసులు ఆ చుట్టుపక్కల లేరు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బలగాల్ని మోహరించినప్పటికీ.. ఘటన జరిగే సమయానికి పోలీసులు సైడైపోయారు.
నిజానికి రైతులు.. జాతీయ రహదారిని దిగ్భందించాలనే కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే.. పోలీసులు దీనిపై ముందుగానే దృష్టిపెట్టారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులతో పాటు.. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన పలువురు నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీంతో చాలా కొద్ది మంది మాత్రమే.. హైవే దిగ్భంధనానికి వచ్చారు. స్వచ్చందంగా వచ్చినవారు.. హైవేలపై ఎక్కడిక్కకడ ఆందోళనకు దిగారు. పోలీసులు నేతలందర్నీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన రైతులు మాత్రం.. తరలి వచ్చారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి ఘటన విషయంలో పోలీసులు వ్యూహాత్మకంగా దూరం జరిగారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఏదో ఓ హింసాత్మక ఘటన జరిగితే.. ఆ కారణం చూపి.. రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపవచ్చన్న వ్యూహాన్ని పోలీసులు అమలు చేశారంటున్నారు. మరో వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ ఘటన జరిగిన మరుక్షణం..సాక్షిటీవీకి ఫోన్ ఇన్ ఇస్తూ.. చంద్రబాబు దాడి చేయించారనే ఆరోపణలు చేశారు. రాజధాని ఆందోళనల కేంద్రం రాజకీయం… విధ్వంసం దిశగా సాగుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఈ విధ్వంస కోణం ఎవరిదన్నదే ఆసక్తికరం.