అమరావతి రాజధానికి సంబంధించి ఓ జీవోను చూపించి.. ఆ జీవో వల్ల దళిత రైతులకు అన్యాయం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై కేసు పెట్టిన ఎమ్మెల్యే ఆర్కేకు.. రాజధానికి నిజంగా భూములు ఇచ్చిన రైతులు షాకిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అమరావతి రాజధానిగా మార్చడం వల్ల… అమరావతిలో భూములు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోయారని.. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమని .. అలాగే ఎమ్మెల్యే ఆర్కే కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారని ఆరోపిస్తూ.. వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. దళిత జేఏసీ ఆధ్వర్యంలో అసైన్డ్, దళిత రైతులు సమావేశమై.. ముఖ్యమంత్రి జగన్.. అమరావతి నిర్వీర్యానికి కేసుల కుట్రలు చేస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. అందుకే సీఎం, ఎమ్మెల్యే ఆర్కేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని తీర్మానం చేసుకున్నారు.
ప్రభుత్వ పెద్దలు ఎవరైనా రాజధాని దళితల హక్కులకు భంగం కలిగిస్తే.. వారిపై కూడా అట్రాసిటీ కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. భూముల హక్కులను 41వ నెంబర్ జీవో కాపాడుతోందని.. ఇప్పుడు ఆ జీవోను తప్పు పట్టి.. భూ హక్కుల నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని దళిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి .. తనకు ఫిర్యాదు చేశారంటూ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అంతకంటే ఫిర్యాదు దొరకదన్నట్లుగా సాక్ష్యాల సేకరణలో సిఐడి అధికారులు బిజీ అయిపోయారు. అంతే కాదు నేరుగా చంద్రబాబుకే నోటీసు ఇచ్చారు.
తీరా కోర్టులో ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేవన్నారు. అయితే.. ఇదంతా రాజధానిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే జరుగుతోందని… రాజధాని రైతులు అంటున్నారు. ఈ కుట్రను చేధించాలంటే.. ప్రభుత్వం ఏ ప్దదతిలో కేసులు పెట్టిందో.. అదే పద్దతిలో నిజంగా నష్టపోయిన తము కేసులు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ ప్రకారమే ముందుకెళ్తామంటున్నారు. అయితే వీరి ఫిర్యాదులను సీఐడీ తీసుకుంటుందా.. నిజంగా ఎస్సీ ఎస్టీ రైతుల ఫిర్యాదులను పట్టించుకుంటుందా అన్నది ఇప్పుడు కీలకమైన అంశం.