రాజధాని రైతులు న్యాయపోరాటం ప్రారంభించారు. ప్రభుత్వం కార్యాలయాల తరలింపు విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు లేకపోవడం కోర్టును సైతం ధిక్కరించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటూడటంతో రైతులు సీఆర్డీఏను కోర్టుకు లాగాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందం ప్రకారం.. భూసమీకరణ కింద అమరావతిలో తీసుకున్న భూములను… అభివృద్ధి చేసి ఇవ్వలేదని రైతులు హైకోర్టులో 7 పిటిషన్లు దాఖలు చేశారు. ఒప్పందం సమయంలో మూడేళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్లు దాఖలు చేయాలని సీఆర్డీఏకి ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేశారు.
ఇప్పటి వరకూ రైతులు… కార్యాలయాల తరలింపు వద్దని… రాజధానిని ఇక్కడే ఉంచాలని పిటిషన్లు వేశారు. కానీ.. సీఆర్డీఏ తమ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పిటిషన్లు వేయలేదు. దాన్ని చివరి అస్త్రంగా ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు… ప్రభుత్వం కోర్టును సైతం ధిక్కరించేలా నిర్ణయాలు తీసుకోబోతోందన్న ప్రచారం జరగడంతో.. సీఆర్డీఏపై పిటిషన్లు వేశారు. సీఆర్డీఏ నిబంధనల ప్రకారం… భూములు అభివృద్ధి చేసి ఇవ్వకపోయినా… రాజధాని కట్టకపోయినా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
అలా చెల్లించాలంటే.. అటూఇటూగా… 33 వేల ఎకరాలకు రూ. లక్షన్నర కోట్ల వరకూ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒప్పందంలో స్పష్టంగా ఉండటంతో… ప్రభుత్వం అమరావతిని అయినా నిర్మించాలి.. లేదా.. రూ. లక్షన్నర కోట్ల వరకూ పరిహారం అయిన ా చెల్లించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అమరావతిపై రాజధాని రైతుల పోరాటంలో ఇదో కీలక అడుగుగా భావిస్తున్నారు.