కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అమరావతి రైతులు రాష్ట్రపతికి సంచలన లేఖ రాశారు. రాజధాని విషయంలో ప్రభుత్వమే తమను మోసం చేసినందున చనిపోయే అవకాశం కల్పించాలని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. సీఎం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో..మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డామని లేఖలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు… రాజధానిని సమర్థించి.. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని రైతులు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. కేవలం సీఎం, పలువురి స్వలాభం కోసం.. రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని .. 14 రోజులుగా మా కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేస్తున్నా.. గోడు వినిపించుకున్నవారు లేరని లేఖలో రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తూ… కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారని వాపోయారు. మంత్రులు,ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న రైతుల్ని.. పెయిడ్ ఆర్టిస్టులని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని … అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి.. జైళ్లలో పెడుతున్నారని లేఖలో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది.. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని తరలిపోతే తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం … ఈ బతుకులు మాకొద్దు.. మాకు మరణమే శరణ్యం.. దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. రైతులు రాష్ట్రపతికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. రాజధాని రైతులు.. తాడో పేడో అన్నట్లుగా పోరాడుతున్నారు. వారిపై.. అనేక రకాలుగా అధికార పార్టీ నేతలు.. మాటల దాడి చేస్తున్నారు. విపక్షాలన్నీ వారికి మద్దతుగా నిలిచినా ప్రభుత్వం మాత్రం వారిని.. పరాయి వాళ్లలా చూస్తోంది. వారి గ్రామాలమీదుగా వెళ్తూ.. వారిని నిర్బంధంలో ఉంచుతోంది. ఈ వ్యవహారం.. రాష్ట్రపతికి రాసిన లేఖతో కొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.