విభజన తర్వాత రాజధాని అంటూ లేకుండా పోయిన రాష్ట్రానికి.. రాజధాని కోసం భూములు ఇచ్చినందుకు.. ప్రభుత్వం, మంత్రులు తమను అత్యంత హీనంగా చూస్తూండటం.. మంత్రులు ఘోరమైన వ్యాఖ్యలు చేస్తూండటంపై … రైతులు ఒక్క సారిగా భగ్గుమన్నారు. తుళ్లూరు నుంచి మందడం వరకూ మహాపాదయాత్ర చేశారు. అనూహ్యంగా.. ఈ పాదయాత్రకు.. పదిహేను వేల మందికిపైగా వచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఆకుపచ్చ పతాకం రెపరెపలాడింది. వారి పదఘట్టనలతో.. రాజధాని ప్రాంతం సమర నినాదాలతో మార్మోగింది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. మొదట ఈ పాదయాత్రను చాలా తేలిగ్గా తీసుకున్న అధికార యంత్రాంగం.. కనుచూపుమేరలో కనిపించిన రైతుల్ని చూసి.. షాక్కు గురైంది.
ఆకుపచ్చ జండాలతో పాదయాత్ర చేస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలతో తుళ్ళూరు, మందడం రహదారి నిండిపోయింది. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ.. వైసీపీ నేతలు.. మంత్రులు అదే పనిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ… రైతులు ఎక్కడా కంట్రోల్ తప్పకుండా..శాంతి యుతంగా.. తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. నిరసనను.. జాతీయ స్థాయిలో హైలెట్ అయ్యేలా చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రత్యేకంగా.. పాదయాత్ర కోసం ప్రయత్నాలు చేయలేదు. రాజధాని పరిరక్షణ సమితి పేరుతో.. బృందంగా ఏర్పడిన రైతులే.. ఈ పాదయాత్రను చేపట్టారు.
ఇప్పటి వరకూ కొన్ని గ్రామాల్లోనే జరిగిన.. నిరసనలు..ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా.. రాష్ట్రం మొత్తం వ్యాపింపచేయాలన్న లక్ష్యాన్ని రైతులు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ రైతులకు మద్దతుగా.. ఇతర జిల్లాల్లోనూ.. సభలు సమావేశాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిని దిగ్భందించి.. రైతులు తమ సత్తా చాటాలని అనుకుంటున్నారు.