మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉద్యమమై ఎగిసిపడుతున్నారు. జగన్ సర్కారుపై నిప్పులు కక్కుతున్నారు. ‘మీరు జోక్యం చేసుకోవాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. ఢిల్లీలోనూ ఉద్యమిస్తామని అంటున్నారు. తమ బతుకులు ఆగమైపోయాయని, రోడ్డున పడ్డామని ఆక్రోశిస్తున్నారు. చివరకు అమరావతి రైతుల, అక్కడి సామాన్య ప్రజల ఆగ్రహం ఎంతవరకు వెళ్లిందంటే ‘కృష్ణా, గుంటూరు జిల్లాలను తెలంగాణలో కలపండి’ అంటూ నినదిస్తున్నారు. జగన్ పాలనలో తమకు భద్రత లేదని, తమ జీవితాలు పాడైపోయాయని, అందుకే తెలంగాణలో కలుస్తామని అంటున్నారు. అమరావతి రీజియన్, కృష్ణా, గుంటూరు జిల్లాలను తెలంగాణలో కలుపుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలు పక్కా ఆంధ్రా జిల్లాలు కదా. తెలంగాణలో ఎలా కలుస్తాయి? అనే ప్రశ్న వేసుకోవడం అనవసరం. ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న రైతులు, ప్రజలు తమ నిరసనను ఈవిధంగా వ్యక్తం చేశారనుకోవాలి. ప్రజలకు ఆగ్రహం వస్తే ఏమైనా అంటారు. దానికి లాజిక్ ఉంటుందా? ఉండదా? అనేది తరువాత సంగతి. కృష్ణా, గుంటూరు జిల్లాలు తెలంగాణ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఎక్కడో ఏపీ మధ్యలో లేవు. ఈ రెండు జిల్లాలకు తెలంగాణతో అనుబంధమూ ఎక్కువే. అందుకే ఆగ్రహంతో ఉన్న రైతులు ఈ రెండు జిల్లాలను తెలంగాణలో కలపండని డిమాండ్ చేశారు. వీరు తెలంగాణలో కలపండని అనగానే కేసీఆర్ వెంటనే ఆ రెండు జిల్లాలు తమకు ఇచ్చేయాలని అనరు కదా.
రైతులు ఇలా అంటున్నారంటే వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అమరావతి రైతుల ఆగ్రహాన్ని చల్లార్చే ఏ చర్యలనూ ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకోలేదు. కనీసం వైకాపా ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా కనబడటంలేదు. వారు జనంలోకి వెళ్లడానికి భయపడుతున్నారు. అమరావతి గురించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాలకు అనేక ఆశలు పెట్టి దాదాపు 34 వేల ఎకరాలు సేకరించారు. హైదరాబాదును మించిన రాజధాని నిర్మిస్తామన్నారు. ప్రపంచంలోని ఐదు గొప్ప రాజధానుల్లో అమరావతి ఒకటవుతుందన్నారు. తన ప్రభుత్వం నిర్మించబోయే రాజధాని గురించి ఆయన గొప్పలు చెప్పుకోని రోజు లేదు. అమరావతి గురించి ఆయన ఎంతలా ఊరించారో అందరికీ తెలుసు. చివరకు భూములిచ్చిన రైతులను విడతలవారీగా సింగపూర్ కూడా పంపించారు. తాను నిర్మించబోయే రాజధాని ఏ లెవెల్లో ఉంటుందో రైతులకు తెలియచెప్పడానికి ఆయన ఈ పని చేశారు.
అయినప్పటికీ ఎన్నికల్లో రాజధాని ప్రాంత జిల్లాల్లోనే టీడీపీని ఓడించారు. ఇప్పుడు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటంతో టీడీపీ వారికి అండగా నిలబడింది. రాజధాని అమరావతిలో ఉంటుందా, లేదా అనేది పక్కనపెడితే ప్రభుత్వం మీద పోరాటానికి టీడీపీకీ ఆయుధం దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిలో ఉద్యమిస్తున్నది ఒక్క రైతులు, ప్రజలే కాదు, న్యాయవాదులు కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు తరలింపు ప్రతిపాదనను వారు వ్యతిరేకిస్తున్నారు. రైతుల ఉద్యమం ఉధృతం కావడానికి స్పీకర్ తమ్మినేని సీతారాం సహా మంత్రులు, వైకాపా నేతలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. అమరావతి శ్మశానమని, ఎడారి అని చేసిన వ్యాఖ్యలు రైతులకు బాధ కలిగిస్తున్నాయి. ఎవరికైనా సరే వారి ప్రాంతాన్ని కించపరిస్తే కోపం వస్తుంది కదా.
అందులోనూ ఇది బోగస్ ఉద్యమమని, నాటకమని చేస్తున్న వ్యాఖ్యలతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలని అమరావతి రైతులు డిమాండ్ చేయడాన్ని అలా పక్కనుంచితే తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల ప్రజలు (ఇవి మహారాష్ట్ర గ్రామాలు) తమను తెలంగాణలో విలీనం చేయాలని ఇప్పటికీ కోరుతున్నారు. తెలంగాణలో పాలన బాగుందని, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అందుకే తాము తెలంగాణలో విలీనం అవుతామని అంటున్నారు. మహారాష్ట్రకు చెందిన కొందరు నాయకులు తమ రాష్ట్రంలో టీఆర్ఎస్ శాఖ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో వారు కేటీఆర్‌తోనూ భేటీ అయ్యారు. పక్క రాష్ట్రంలో విలీనం అవుతామని చెప్పడం అసంతృప్తికి చిహ్నంగా భావించాలి.