అమరావతి రైతులకు కౌలు విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం జూన్ 22వ తేదీన ప్రకటించింది. నిధులు మంజూరు చేసినట్లుగా చెప్పింది. రైతుల అకౌంట్లలో పడతాయని కూడా అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే..ఆగస్టు చివరికి వచ్చిన అమరావతి రైతులకు కౌలు అందలేదు. కావాలనే.. రైతులను ఇబ్బంది పెట్టేందుకే.. కౌలును నిలిపివేశారని రైతులు మండిపడుతున్నారు. మంజూరు చేసినట్లుగా ప్రకటనలు చేసి.. తర్వాత నిలిపివేయడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. రైతులందరూ..సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయం తెలిసిన పోలీసులు వారందర్నీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. పలు మార్గాల నుంచి సీఆర్డీఏ ఆఫీసుకు వెళ్లే దారులను… పోలీసులు దిగ్బంధించారు. అయినా దాటుకుని వచ్చిన వారిని వచ్చినట్లుగా అరెస్ట్ చేశారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో 29వేల మంది చిన్న, సన్నకారు రైతులే. వారిలో అత్యధికులకు భూములు ఇచ్చే వరకూ వ్యవసాయమే జీవనాధారం. అందుకే..జరీబు, ఇతర పొలాలకు విడివిడిగా కౌలును నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో కౌలు పద్దతిగా జూన్‌లోనే ఇచ్చేవారు.
ఈ ప్రభుత్వం.. రాజధాని భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి… అమ్మడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కానీ..రైతులకు న్యాయంగా నెరవేర్చాల్సిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదు. రాజధానిని తరలిస్తూ నిర్ణయం తీసుకుని వారికి క్షోభకు గురి చేయడమే కాదు.. ఇప్పుడు కౌలు కూడా ఇవ్వడం లేదు. రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు…అంతటా చర్చనీయాంశం అవుతోంది.