శంకుస్థాపన చేసి గొప్ప రాజధాని అవ్వాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీనే అమరావతిని కాపాడాలని రైతులు ముక్తకంఠంతో వేడుకున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతులు అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాదయాత్ర చేశారు. శంకుస్థాపన ప్రదేశం వద్ద దీక్షలు చేశారు. అయితే.. రైతుల పోరాటంపై రోజంతా దాడి జరిగింది. వైసీపీ నేతలు ఎప్పట్లానే వారిని పెయిడ్ ఆర్టిస్టులని విమర్శలు చేశారు. బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్ పెట్టి.. అదేదో 29 గ్రామాల సమస్య అన్నట్లుా మాట్లాడి.. ఆ 29 గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నట్లుగా చెప్పుకొచ్చారు.
కొత్తగా మంత్రి పదవులు పొందిన అప్పలరాజు లాంటి నేతలు.. చంద్రబాబు సూడో ఉద్యమం చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల సూటిపోటి విమర్శలే కాదు.. రైతుల ఉద్యమంపై నేరుగా ఎటాక్ కూడా జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి బహుజన ఫ్రంట్ పేరుతో కొంత మందిని తీసుకొచ్చిన వైసీపీ నేతలు.. మూడు రాజధానులకు మద్దతుగా.. నినాదాలు చేస్తూ రైతుల శిబిరం మీదకు దూసుకువెళ్లేలా చేశారు. రైతులు శాంతియుతంగా మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పవిత్రంగా చూసుకుంటున్నామని .. అలాంటి ప్రాంతంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
రైతుల కార్యక్రమానికి అనేక ఆంక్షలు పెట్టిన పోలీసులు .. వారిపై దాడి చేయడానికా అన్నట్లుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మాత్రం సాఫ్ట్‌గా డీల్ చేశారు. రైతుల మీదకు దూసుకెళ్లినా చూస్తూండిపోయారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చి రోడ్డున పడ్డ తమను మరింత రెచ్చగొడుతున్నారని రైతులు మండిపడ్డారు. ఎం చేసినా.. ఉద్యమాన్ని ఆపబోమని తేల్చి చెబుతున్నారు.