అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా రైతులు సుదీర్ఘ ఉద్యమ పోరాటాన్ని గుర్తు చేసుకుని మరింతగా స్ఫూర్తి పొందుతున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి .. రాజధాని సౌకర్యం కల్పించేందుకు ప్రాణంగా చూసుకునే భూములు ఇచ్చి.. తాము పడుతున్న కష్టాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నా… వెనుకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నారు. కుట్రలు , కుతంత్రాలతో భూములిచ్చిన తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నా… వారెవరూ వెనక్కి తగ్గడంలేదు. అయితే.. వారికి మద్దతిచ్చే ఓ బలమైన శక్తే లేకుండా పోయింది. అమరావతిని నిర్ణయించిన టీడీపీ .. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఉన్న బలాన్ని కోల్పోయింది.
రైతులకు పార్టీ పరంగా మద్దతివ్వడమే తప్ప.. మరో విధంగా సాయం చేయలేకపోతోంది. దీంతో.. అమరావతి రైతులు బలమైన అండ కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు తమ మద్దతు అమరావతికే అని చెబుతున్నారు కానీ.. చివరికి వచ్చే సరికి… మూడు రాజధానులను ఏపీ సర్కార్ ఇంప్లిమెంట్ చేస్తే తమకు సంబంధం లేదంటున్నారు. దాంతో అమరావతి రైతులకు ఉన్న ఆశ కరిగిపోయింది. ఇప్పుడు ఏడాది అవుతున్న సమయంలో వారంతా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైపు చూస్తున్నారు. ఉపరాష్ట్రపతి కాక ముందు ఆయన అమరావతి కోసం కృషి చేశారు. కేంద్రం నుంచి నిధులు ఇప్పించడానికి ప్రయత్నించారు.
తాను పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశారు. దీంతో రైతులంతా వెంకయ్యనాయుడు అండ కోసం చూస్తున్నారు. అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్న కమ్యూనిస్టు పార్టీ నేత నారాయణ కూడా అదే చెబుతున్నారు. వెంకయ్యనాయుడు జోక్యం చేసుకోవాలంటున్నారు. పదవి కారణంగా ప్రత్యక్షంగా ఆయన అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేయకపోయినా… పరోక్షంగా అయినా… కేంద్ర పెద్దలతో మాట్లాడి… అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చూడాలని వారు కోరుతున్నారు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు స్పందన ఎలా ఉంటుందో మాత్రం సస్పెన్స్..!