ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను రైతులు ఆగ్రహించారనో.. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనో వెనక్కి తీసుకోలేదు. అమిత్ షా డిసైడయ్యారని బీజేపీ కూడా అమరావతికే మద్దతు ప్రకటించిందని వెనక్కి తగ్గలేదు. అంతకు మించి సాంకేతిక అంశాలు కూడా కారణం కాదు. ఇప్పుడు బండి నడవడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు వచ్చే మార్గం అమరావతి భూముల అమ్మకం. అందు కోసమే మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. అలా బిల్లు వెనక్కి తీసుకోక ముందే రూ. మూడు వేల కోట్ల ప్రతిపాదనలు రెడీ చేసి బ్యాంకులకు సమర్పించారు. మొత్తంగా ఐదు వందల ఎకరాల వరకూ అమ్మేసి లోన్ తీరుస్తామని ప్రతిపాదన పెట్టారు.
రూ. మూడు వేల కోట్లతో అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం రుణ ప్రతిపాదనల్లో చెప్పింది. బ్యాంకర్లకు నమ్మకం కలిగించడానికి కొన్ని కొన్ని చోట్ల..ఓ పది మంది వర్కర్లు పనులు ప్రారంభించారు. వారేం చేస్తారో తెలియడం లేదు కానీ.. అక్కడ పనులు జరుగుతున్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి అమరావతిలో భవనాలు నిర్మించిన వారికి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అవి క్లియర్ చేస్తి రివర్స్ టెండరింగో.. మరొకటే వేసి వేరే వారికి పనులు అప్పగిస్తేనే చేయగలరు. బిల్లులు చెల్లించకుండా నిర్మాణ కంపెనీలు మళ్లీ వచ్చి పనులు చేసే పరిస్థితి లేదు. కానీ పనులు ప్రారంభమయ్యాయి అని చెప్పడానికి మాత్రం కొంత సెటప్ ఏర్పాటు చేశారు.
అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని .. అప్పులు ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఇలా తీసుకుంటున్న రుణాలు ప్రభుత్వమే వాడుకుంటుంది. అమరావతికి ఖర్చు పెడతారన్నది అపోహే. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకూ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల్లో ఒక్క పైసా కూడా ఆయా కార్పొరేషన్లకు ఇవ్వలేదు. తానే వాడుకుంది. ఇప్పుడు అమరావతి పరిస్థితి కూడా అంతే. అమరావతిలో ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు. రుణాలు తీసుకుని సొంతానికి వాడుకోవడమే. ఇది బహిరంగ రహస్యం.
అయితే బ్యాంకులు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల విషయంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. .పైగా మూడు రాజధానులు తెస్తామని అమరావతి పీక నొక్కుతామని నేరుగానే మంత్రులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకులు స్పందన పై ఆసక్తి ఏర్పడింది. అయితే రుణాల కోసం ప్రత్యేక కన్సల్టెన్సీలు…, కమిషన్లతో ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రభుత్వం అనుకున్న విధంగా రుణం తీసుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే అమరావతిపై పైసా ఖర్చు పెట్టకుండా రైతుల భూముల్ని అమ్మడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదని అనుకోవాలి.