అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఆ పేరుతో టీడీపీ నేతలపై పెట్టిన కేసులన్నీ తేలిపోవడం ఖాయమని స్పష్టమైంది. ఈ మేరకు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు ఇతరులపై పెట్టిన కేసుల్ని హైకోర్టు కొట్టి వేసింది. నిజానికి దమ్మాలపాటి కేసులో విచారణపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడ ఇక వాదించడం కష్టమని బుద్ది వచ్చిందని చెప్పి పిటిషన్ ఉపసంహరణకు అనుమతి తీసుకున్నారు. పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఈ కేసును నెల రోజుల్లోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకు దిశానిర్దేశం చేసింది.
ఆ మేరకు విచారణ జరిపిన హైకోర్టు ఆధారాల్లేని కారణంగా ఎఫ్ఐఆర్లను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో అడ్వకేట్ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ రాజధాని ఎక్కడ వస్తుందో ముందే సమాచారం తెలుసుకుని పెద్ద ఎత్తున భూముల్ని కొనుగోలు చేశారని ఏసీబీ కేసులు పెట్టింది. అయితే ఈ కేసులను అడ్వకేట్ జనరల్ పై పెట్టినా అందులో అసలు టార్గెట్ ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిందలు వేయడమని ఆయన కుటుంబసభ్యులకు కొన్ని సెంట్ల భూములు ఉన్నాయని కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వాటిని సోషల్ మీడియాలో.. మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. కానీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్పై దర్యాప్తుపై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అనుకూల ఫలితం రాలేదు. ఈ తీర్పులతో ఇంత కాలం అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ వచ్చిన ఆరోపణు తేలిపోయినట్లయింది.