ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో పెట్టిన ఒక లైవ్ డిబేట్ లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ని ఈరోజు సాయంత్రం లైవ్ డిబేట్ లో అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ చెప్పుతో కొట్టడం సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన వెంటనే డిబేట్ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ ప్రోగ్రాం కి బ్రేక్ ఇచ్చేయడమే కాకుండా, ఆంధ్ర జ్యోతి యాజమాన్యం ఆ కాసేపటికే యూట్యూబ్లో అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని తొలగించింది. అయినప్పటికీ, అప్పటికే కొందరు నెటిజన్లు ఆ వీడియో ఫుటేజ్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
అమరావతి విషయం లో జగన్ కొత్త నిర్ణయం:
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంలో కొత్త నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతిలో 50 శాతం, అంతకుమించి పూర్తై ఆగిపోయిన నిర్మాణాలను రూ.3 వేల కోట్లతో పూర్తి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి మెట్రో రీజయన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ పనులు అప్పగిస్తూ ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే హఠాత్తుగా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి, రాజధాని తరలింపు విషయంలో జగన్ ఆలోచన మారిందా? లేక కేవలం విజయవాడ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసం ఈ ఎత్తుగడ వేశారా అన్న అంశంపై చర్చించడానికి ఆంధ్రజ్యోతి ఛానల్ లైవ్ డిబేట్ పెట్టింది. అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ తో పాటు అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు ఈ చర్చ కార్యక్రమానికి హాజరయ్యారు.
విష్ణువర్ధన్ రెడ్డి వెటకారం:
అయితే “గ్రాఫిక్స్ పూర్తి చేద్దాం” శీర్షికన సాగిన ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కాస్త వెటకారంగా మాట్లాడారు. అప్పట్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, మంత్రులు వంటి వారందరూ ముంబైకి వెళ్లి గంట కొట్టు మరీ అప్పు అడుక్కునే వారు అంటూ కాస్త వెటకారం గా అప్పటి నేతలను యాచకులు గా చిత్రీకరిస్తున్నట్లుగా మాట్లాడారు. దీంతో అక్కడ డిబేట్లో పాల్గొన్న అందరూ ఆయన మాటలకు అభ్యంతరం చెప్పారు.
చెప్పుతో కొట్టిన అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్
ఈ డిబేట్ ఇలా జరుగుతూ ఉండగానే అమరావతి జేఏసీ నేత శ్రీనివాస విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. విష్ణువర్ధన రెడ్డి ఏ మాత్రం తగ్గకుండా అమరావతి జేఏసీ నేత అయిన శ్రీనివాస్ ని పెయిడ్ ఆర్టిస్ట్ అని సంబోధించారు. దానికి శ్రీనివాస్ కూడా తగ్గకుండా, విష్ణువర్ధన్ రెడ్డిని ఉద్దేశించి మీరు జాతీయ పార్టీ నాయకులు అయి ఉండి ఇలా జగన్ కు భజన చేస్తున్నట్లుగా మాట్లాడకూడదు అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి విష్ణువర్ధన్ రెడ్డి- మరి మీ భజన చేయమంటారా, మీరు వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పని చేసుకోండి అంటూ రెచ్చగొట్టారు. దానికి రెచ్చిపోయిన శ్రీనివాస్ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ కాలి చెప్పు తీసి చేత్తో పట్టుకున్నారు. అప్రమత్తం అయిన యాంకర్ వెంకటకృష్ణ ఆయన చెయ్యి పట్టుకుని ఆపడానికి ప్రయత్నించి నప్పటి కీ, ఆవేశంతో ఊగిపోయిన శ్రీనివాస్ ఆ చెప్పు ను బిజెపి నేత మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిన విష్ణువర్ధన్ రెడ్డి మీద విసరడం, అది ఆయనకు ఒకింత తగలడం రెప్పపాటులో జరిగిపోయింది.
ఘటన తర్వాత కూడా కొనసాగిన డిబేట్ :
అయితే ఆ ఘటన తర్వాత కూడా డిబేట్ కొనసాగింది కానీ శ్రీనివాస్ డిబేట్ లో కనిపించలేదు. విష్ణువర్ధన్ రెడ్డి ముఖం మాడ్చుకుని కూర్చుని ఉండగా, అప్పటి ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వంటి వారు విష్ణువర్ధన రెడ్డి వంటివారు వెటకారంగా మాట్లాడటం కాస్త తగ్గించాలని హితవు పలికారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా తన భవిష్యత్తు డిబేట్ల లో శ్రీనివాస్ ని అనుమతించనని చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా లైవ్ డిబేట్ లో విష్ణువర్ధన్ రెడ్డి మీద అమరావతి జేఏసీ నేత చెప్పు విసరడం ప్రస్తుతం సంచలనంగా మారింది. బిజెపి పార్టీ దీనికి ఎలా ప్రతిస్పందిస్తుంది అన్నది, అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఘటనను స్వాగతిస్తుందా లేక ఖండిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.