నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో భూములిచ్చిన రైతులకు లాభం జరుగుతుందనే నమ్మకం కలిగించి భూసమీకరణ భారీగా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృతకృత్యులైనారనేది కాదనలేని వాస్తవం. మొత్తంగా అక్కడ తమ భూముల రేట్లు పెరుగుతాయనే ఆశ ఒకవైపు, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే విశ్వాసం మరోవైపు ఇందుకు దోహదం చేశాయి. అంతేగాక ఆ ప్రాంతాల సామాజిక, ఆర్థిక పొందిక కూడా తోడైనాయి. అయితే అసలు సవాళ్లు సమస్యలు ఇక ముందే వుంటాయి. అంత పెద్ద నిర్మాణ యజ్ఞంలో వంద యాభై గజాల వారికే స్థానం వుండదు గనక యాభైకి లోపు వారంతా ఏదో విధంగా మరొకరికి అప్పగించి ఇచ్చినంత పుచ్చుకుని తప్పుకోవాల్సి వస్తుంది.
ప్లాట్లలో చిన్నవి ఒకచోట, మధ్యతరహావి మరో చోట, పెద్దవి వూరికి దూరంగా వుండేలా ప్లాను తయారైంది. మొదట చెప్పినట్టు గాక అంతర్గత రోడ్ల విస్తీర్ణం పెంచడం వల్ల రోడ్డు పక్కన మంచి ప్లాట్లు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. అనుసంధాన రోడ్డుకు లింకు రోడ్లు వేసేట్టయితే తమకు ఎక్కడో ప్లాట్లు వచ్చి విలువ తగ్గి పోతుందనే భయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కొన్ని గజాలు అదనంగా కావలసి వస్తే పక్కనే ఇవ్వడం గాక అలాటి అవసరాలున్న భూములను అన్నీ కలిపి ఒకచోట వేలం వేస్తామంటున్నారు. దాన్నుంచి వచ్చే మొత్తంతో వారు ఎలాగో సమకూర్చుకోవాలన్న మాట.
300 గజాలు పైబడిన వారికి ఒక అంతస్తు అదనంగా వేసుకోవడానికి అవకాశం ఇస్తామంటున్నా ఇదంతా పై తరగతివారికే తప్ప చిన్న తరహా వారికి ఉపయోగపడేది తక్కువ. ప్లాట్లు కేటాయించిన తర్వాత ప్రైవేటు కాంట్రాక్టర్ల తాకిడిలో ప్రభుత్వ పాత్రనే నామమాత్రమై పోతుంది గనక ప్రతిదీ వివాదమై పరిష్కారం కోసం ఎదురు చూడవలసి వుంటుంది.
పెద్దప్లాట్లు వచ్చిన వారు కూడా వాటిని చిన్నవిగా మార్చుకోవడానికి అనుమతించే అవకాశమే లేదని అదనపు కమిషనర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టంగా చెప్పడం ఆందోళన పెంచింది. నివాస ప్రాంత ప్లాట్లు వాణిజ్యప్లాట్లు వీటికి సంబంధించిన నిబంధనలు వేర్వేరుగా వున్నాయి. ఏఏ చోట్ల ఏతరహా నిర్మాణాలు చేయొచ్చు ఏవి చేయకూడదనేది ఖచ్చితంగా వుంటుంది. కనుక వాణిజ్య స్థలం అనగానే లాభాలు వచ్చిపడిపోతాయని భావించడానికి లేదు..
సమీకరించిన మొత్తం భూమిలో పదివేల ఎకరాలు ‘క్రిడా’ వేలం వేస్తుంది. వేలం అనగానే వాణిజ్య గృహ సముదాయాలు నిర్మించే పెద్ద సంస్థలే వీటిని స్వంతం చేసుకోవడం తథ్యం. ఒక వంతు రహదారులకు మరో వంతు ఈ వాణిజ్య సామ్రాజ్యాలకు పోయిన తర్వాత మిగిలిన మూడో వంతులో చిన్న చితక రైతులు బుల్లి బుల్లి ప్లాట్లతో వుండటం ఎలాగూ కుదిరేపని కాదు గనక వాటిని కూడా ఏదో ఒక ధరకు ధారాదత్తం చేసి మరో చోటికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందడితో ఇతరత్రా కూడా భూముల రేట్లు పెరుగుతాయి గనక సామాన్యులకు అందుబాటులో వుండకుండా పోతాయి.
దీని వలన సంపన్న కుటుంబాలకు సంతోషమే అయినా సన్నకారు రైతులు అయోమయంలో పడతారు. ప్రభుత్వం మొదట వారి భూమిని చేతుల్లోకి తీసుకుంది గాని స్పష్టత ఇవ్వడం లేదు. వివిధ అధికార కార్యక్రమాల్లో సందేహాలు అడిగితే అధికారులు ఆగ్రహించడం లేదా దాటేయడం జరుగుతున్నది. అంతా వారి చేతుల్లోనూ లేదు. ఇప్పటిలాగే వ్యవహరిస్తే అన్నీ అధికారులకు వదిలేస్తే మాత్రం అయోమయం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇప్పటికి రైతులు ముఖ్యమంత్రి ఏదో చేస్తాడని నమ్ముతూనే అనుమానంగా అస్పష్టంగా చూస్తున్నారు. అంతా నల్లేరుమీద బండిలా నడిచిపోతుందనుకోకుండా నిజాలను గుర్తించి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనపైనే వుంటుంది.