అమరావతిలో భూసమీకరణకు సహకరించిన రైతులకు లాభసాటి ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఎట్టకేలకు ఆలస్యంగా నేలపాడులో ఆ ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసుకున్నట్టుగా ఈ ప్లాట్లను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించేందుకు క్రిడానే సంధాన కర్త కావడం చూస్తే ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అన్న విమర్శలు నిజమవుతున్నాయా? ఈ భూములు మీరు డెవలప్ చేసుకోలేరు గనక పెద్ద కంపెనీలకు ఇవ్వడమే లాభం అని ఒప్పించే పని క్రిడా తన మీద వేసుకుంది. మెకన్సీ కంపెనీ ప్రతిపాదన ప్రకారం అభివృద్ది చేసిన ప్రాంతంలో రైతులకు 25శాతం, డెవలపర్లకు 75 శాతం దక్కే విధంగా వుంటుంది. ఈ ప్రకారం ఎకరాకు 630 చదరపు అడుగులు స్థలం రైతులు వదులుకోవలసి వుంటుంది. అంటే పూలింగు ఏరియాలో రైతుల వాటా కింద వచ్చే 14,400 ఎకరాలలోనూ 90,72,000 చదరపు అడుగుల స్థలాన్ని ధారాదత్తం చేయవలసి వుంటుందన్నమాట. దీనిపై రైతు ప్రతినిధులు సందేహాలు లేవనెత్తితే క్రిడా అధికారులు ఏదో చెప్పి సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని వల్ల లాభం రైతులకే దక్కాలన్నది తన అభిమతమని గతంలో ముఖ్యమంత్రి పదేపదే చెబుతూ వచ్చారు. అందుకు తాము సహకరిస్తామన్నారు.అయితే ఇప్పుడు ఆ సహాయం రియల్ ఎస్టేట్ కంపెనీల రూపంలో చేస్తామంటున్నారు! ఈ క్రమంలో రైతలు నిర్మాణాలు చేసుకుంటామంటే పెట్టిన నిబంధనలకన్నా బిల్డర్లకైతే ఉదారంగా ఎక్కువ అంతస్తులకు అనుమతినిచ్చేలా చేశారు. ఒకసారి వారు పెద్ద ఎత్తున రంగ ప్రవేశం చేస్తే వ్యక్తిగతంగా కట్టుకునే పరిస్థితే వుండకుండా పోతుంది. ఈ 14 వేల ఎకరాలు ఇంచుమించుగా రియల్ కంపెనీలకే అప్పగించవలసి వస్తే అప్పుడు ఇప్పుడు అక్కడున్న ధరల ప్రకారం భూములు అమ్ముకుంటే వచ్చే దానికన్నా ప్రస్తుత నిబందనల ప్రకారం డెవలప్మెంట్ వల్ల దక్కేది కొంచెం తక్కువగానే వుంటుంది. పైగా వారికి అదనంగా 900 ఫ్టాట్ట వరకూ దక్కుతాయి. ఏ విధంగా చూసినా ఇది వ్యాపారులకు తప్ప భూములిచ్చినవారికి అదనంగా చేసే మేలు పూజ్యం. పైగా ఈ చక్రబంధంలో రైతులు వారిచుట్టూ తిరుగుతూ నిస్సహాయతలో కూరుకుపోవలసి వుంటుంది.మామూలుగా అయితే పదేళ్ల పాటు ప్రభుత్వం కౌలు ఇవ్వాలి. ఇప్పుడు నామకార్థంగా ప్టాట్టు చూపించి ఆ బాధ్యత కూడా చేతులు దులిపేసుకుంది. రేపు బిల్డర్ల రూపంలో వచ్చేది కూడా పాలక వర్గ పెద్దలే గనక వారికి లాభాల వర్షం కురుస్తుంది. భూములిచ్చిన వారికి నామకార్థపు లాభమే మిగులుతుంది! ఇది అమరావతిలో ఆవిష్క్రతమవుతున్న రియల్ సీన్